కుప్పంలో సీఐపై వైసీపీ నేత దాడి.. లోకేష్ అదిరిపోయే పంచ్‌

Update: 2021-10-23 09:45 GMT
పోలీస్ అధికారుల సంఘం నాయ‌కులు కొంద‌రు.. తాజాగా చంద్ర‌బాబు త‌మ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆయ‌న డీజీపీపైనా.. ఇత‌ర పోలీసుల‌పైనా చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసు కోవాల‌ని అన్నారు. అయితే.. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌కు సంబంధించి.. లోకేష్‌.. ఇదే పోలీసుల సంఘంపై పంచ్‌లు పేల్చారు. కుప్పంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌లో.. వైసీపీ మండ‌ల స్థాయి నేత కోదండ‌రెడ్డి.. స‌ర్కిల్ ఇన్స్‌పెక్ట‌ర్‌పై దురుసుగా వ్య‌వ‌హ‌రించారు. దీంతో ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. దీనిపై స్పందించిన లోకేష్‌.. ఈ విష‌యం పై ఏమంటారు.. సార్‌.. అని పోలీసు అధికారుల సంఘానికి చుర‌క‌లు అంటించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ, వ‌ర్సెస్‌టీడీపీ మ‌ధ్య వివాదం ఎప్ప‌టి నుంచో ఉంది. ఇప్పుడు మ‌రింత ఎక్కువైంది. ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో స్థానికి నేత‌లు ఒక‌రిపై ఒకరు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సెంథిల్ కుమార్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ.. టీడీపీ నాయ‌కులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అయితే.. ఇదేస‌మ‌యంలో  వైసీపీ చేప‌ట్టిన జ‌నాగ్రహ దీక్షలో ఉన్న వైసీపీ నేతలు వెంటనే టీడీపీ నాయకులపైకి దూసుకువచ్చారు.

ఇరు పక్షాల నేతలూ బాహాబాహీకి దిగడంతో కుప్పం పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైసీపీ నేత కోదండరెడ్డి సీఐ సాదిక్‌ అలీ చొక్కా పట్టుకున్నారు.దీంతో ఇటు పోలీసులు.. అటు వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య వివాదం రేగింది. ఈ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై ఆయ‌న పోలీసు అధికారుల సంఘానికి కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు.

‘కుప్పం అర్బన్ సీఐ సాదిక్ అలీ మీద కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండల వైసీపీ కన్వీనర్ కోదండ రెడ్డి చేయి చేసుకుంటే పోలీసు అధికారుల సంఘం క‌నీసం ఖండించ‌లేదు.`` అని లోకేష్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ఎప్పుడూ.. టీడీపీపై విరుచుకుప‌డుతున్న‌ పోలీసు అధికారుల సంఘం నాయ‌కులు జ‌న‌కుల శ్రీనివాస‌రావు..పైనా లోకేష్ చ‌లోక్తులు విసిరారు. టీడీపీ నేత‌ల‌పైనే మీరు మీసం తిప్పుతారా. వైసీపీ నేత‌లైతే మీసం తిర‌గ‌దా? అఅంటూ.. ప్ర‌శ్నించారు.

తాజాగా కుప్పం ఘ‌ట‌న‌కు సంబంధించి..  డీజీపీ గారి అభిమాన‌స్తులైన వైసీపీ నేత‌ల‌కు ఏదో బీపీ వ‌చ్చి సీఐకి మ‌సాజ్ చేశార‌ని ప్ర‌క‌ట‌న ఇప్పిస్తారేమో చూడాలి. అంటూ.. లోకేష్ వ్యాఖ్యానించారు.  ఎంతో గౌర‌వించాల్సిన పోలీసు వ్య‌వ‌స్థ‌ని వైసీపీకి తాక‌ట్టుపెట్టేసిన డిజిపి గారు. ఒక మండ‌ల వైసీపీ నేత సీఐని కొడితే, ఆ సీఐని నిమిషాల్లో బ‌దిలీ చేశారంటే, అధికార‌పార్టీ ప్రాప‌కం కోసం మీరు దేనికైనా తెగిస్తార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని లోకేష్ విమ్శ‌లు గుప్పించారు. పోలీస్ కాప‌లాలో రాష్ట్రంలో సాగుతున్న గూండారాజ్‌కి పోలీసులూ బ‌లైపోవ‌డం విచార‌క‌రమ‌న్నారు. సీఐపై దాడి, ప‌నిష్మెంట్ బ‌దిలీపై పోలీసు అధికారుల సంఘం స్పందిస్తుందేమో చూద్దాం అంటూ  నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం దీనిపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. 
Tags:    

Similar News