మంత్రి పదవుల కోసం ఆమె చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న వైసీపీ నేతలు

Update: 2021-10-17 03:33 GMT
ప్రయత్నాలు పైరవీలు ఎన్ని చేసినా.. కోరుకున్నది దక్కాలంటే అదృష్టం కలిసి రావాలి. పై వాడెవడో కరుణించాలి. ప్రస్తుతం ఏపీ కేబినెట్ విస్తరణ ఉండండంతో మంత్రి పదవిపై ఆశలన్నీ పెట్టుకున్న నేతలు అమ్మ ఆశీస్సుల కోసం ప్రదక్షణలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా కూడా ఒరిస్సా సరిహద్దులో ఉంటుంది. నగరి ఏమో ఆ చివర, శ్రీకాకుళం ఏమో ఈ చివర. అయితే అంతదూరం నుంచి వచ్చిన ఎమ్మెల్యే రోజా శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. సరే ఇంత దూరం వచ్చారు కదా మీడియాతో మాట్లాడుతారని, ఆమె పర్యటన ముఖ్య ఉద్దేశం ఏమిటో చెబుతారని అందరూ అనుకున్నారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా అందరికీ టాటా చెబుతూ ఓ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు.

శ్రీకాకుళం జిల్లాలోని పాపయ్య వలసలో దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీస్సుల కోసం రోజా వచ్చారు. అంతదూరం ఆశీస్పుల కోసం ఎందుకు వచ్చారనే అనుమానం రావచ్చు. రోజానే కాదు వైసీపీలో మహామహులకు ఈ ఊరు సుపరితమే. ఇక్కడ ఉన్న దేవుడమ్మ లలిత ఆశీస్సులు ఉంటే అనుకున్నది జరుగుతుందనే నమ్మకం వైసీపీ నేతల్లో ఉంది. అందుకోసమే లలిత చుట్టూ వైసీపీ నేతలు ప్రదక్షణలు చేస్తుంటారని జిల్లా వాసులు చెబుతున్నారు. రోజాతో పాటు మంత్రి పదవుల ఆశిస్తున్నవారు పాపయ్య పేటకు వచ్చిపోతున్నారు.

దేవుడమ్మకు దేవత ఆవహిస్తుందని ఆ సమయంలో ఆమె ఏం చెప్పినా ఇట్టే జరుగుతుందని జిల్లా వాసుల నమ్మకం. ఈ నమ్మకం జిల్లాల సరిహద్దు దాటిపోయింది. అందుకోసమే అనుకున్నది జరిగి తీరాలనుకునే వారు ఇక్కడకు వచ్చి వాలిపోతుంటారు. దేవుడమ్మ మాటపై ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులకు అంత నమ్మకం ఉంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మను వైసీపీ నేతలు ఇక్కడి తీసుకువచ్చారని చెబుతున్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు 150 స్థానాల్లో విజయం సాధిస్తారని దేవుడమ్మ లలిత చెప్పారంట. ఇంకేముందు ఆమె చెప్పింది అక్షరాలు జరిగి తీరింది. వైసీపీ అధికారంలో వచ్చింది. అందువల్లే వైసీపీ నేతలకు ఆమె మాటపై అంత గురి. రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవులు ఆశిస్తున్న వారు పాపయ్య పేటకు వచ్చి దేవుడమ్మను ప్రశ్న అడుగుతున్నారని చెబుతున్నారు.

స్పీకర్ తమ్మినేని సీతారం, బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి ఇలా మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు దేవుడమ్మ ఆశీస్సులు తీసుకుంటున్నారని చెబుతున్నారు. మూల నక్షత్రం రోజున స్పీకర్ తమ్మినే, రోజా పాపయ్య పేటకు వచ్చారు. మొదటి విడుతలోనే రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఆమెకు జగన్ కేబినెట్‌లో బెర్త్ దొరకలేదు. ఇక తమ్మినేని కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణపై తమ్మినేని కూడా ఆశలు పెట్టుకున్నారు. అధినేత జగన్‌ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు మాత్రమే చేస్తే సరిపోదు అనుకున్నారో ఏమో. దేవుడమ్మ వాక్కుపై నమ్మకం పెట్టుకున్నారు. మరి దేవుడమ్మ వాక్కు ఫలిస్తోందో లేదో వేచిచూడాలి.
Tags:    

Similar News