భ‌ద్ర‌త పెంచాల‌ని డీజీపీకి ఆర్కే లేఖ‌!

Update: 2018-10-09 15:42 GMT
గ‌త నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్ర‌భుత్వ హయాంలో ఏపీలో అవినీతి పేట్రేగి పోయింద‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. అధికారం చేతిలో ఉంద‌ని టీడీపీ ఎమ్మెల్యేలు - మంత్రులు అందిన‌కాడికి దోచుకుంటున్నార‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తోన్న విష‌యం విదిత‌మే. విశాఖ భూకుంభ‌కోణం...ఇసుక అక్ర‌మ ర‌వాణా...భూక‌బ్జాలు...వంటి చ‌ర్య‌ల‌తో అవినీతి విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతోంద‌ని ప్రతిప‌క్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ అవినీతిపై వైఎస్సార్‌ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గ‌త నాలుగేళ్లుగా అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు. రాజధాని భూసమీకరణ - ఓటుకు కోట్లు కేసు - ముఖ్యమంత్రి అక్రమ నివాసం - సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై ఆర్కీ...నాలుగేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. చంద్ర‌బాబు అవినీతి పాల‌న‌ను ఎండ‌గ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌పై కొంద‌రు క‌క్ష గ‌ట్టార‌ని - త‌న‌కు వ‌రుస‌గా బెదిరింపు ఫోన్లు వ‌స్తున్నాయ‌ని ఆర్కే నేడు  ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కు లేఖ రాశారు.

త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని, కాబ‌ట్టి తనకు భద్రతను పెంచాలని కోరుతూ ఏపీ డీజీపీకి ఆర్కే నేడు ఓ లేఖ రాశారు. డీజీపీ ఠాకూర్ కు ఆ లేఖ‌ను స్వ‌యంగా ఆర్కే అందజేశారు. అన్యాయాల‌ను ప్ర‌శ్నించినందుకు తనను చాలామంది టార్గెట్ చేశారని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియాకు వ్య‌తిరేకంగా, అనేక స‌మ‌స్య‌ల‌పై తాను పోరాడినందుకు గ‌తంలో కూడా బెదిరింపు లేఖలు వచ్చాయ‌ని చెప్పారు. అయితే, కొద్ది రోజుల క్రితం మావోయిస్టుల పేరిట కూడా త‌న‌కు బెదిరింపుల లేఖలు వచ్చాయ‌ని చెప్పారు. దీంతో, త‌న‌కు భ‌ద్ర‌త పెంచాల‌ని కోరారు. ప్ర‌స్తుతం ఆర్కేకు వన్‌ ప్లస్‌ వన్‌ గన్‌ మెన్‌ సెక్యూరిటీని ప్ర‌భుత్వం అందజేస్తోంది. త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్న నేప‌థ్యంలో కనీసం టూ ప్లస్‌ 2 (2+2) గన్‌ మెన్‌ సెక్యూరిటీ అందజేయాలని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Tags:    

Similar News