బీఆర్ఎస్‌ను ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మ‌రు: వైసీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్ వైర‌ల్!

Update: 2022-10-06 06:01 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పోటీ చేస్తుంద‌ని కేసీఆర్ ప్ర‌కటించారు. ఈ నేప‌థ్యంలో ఈ పార్టీకి వ్య‌తిరేకంగా, అనుకూలంగా రాజ‌కీయ పార్టీలు, నేత‌ల నుంచి స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కోవ‌లోనే విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గణేష్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బీఆర్ఎస్ ఏర్పాటుతో ఆంధ్రప్ర‌దేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఉండదని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తేల్చిచెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ శూన్య‌త‌కు అవ‌కాశ‌మే లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న‌ సంక్షేమ పథకాలు, దార్శనికత వల్ల వచ్చే 30 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డే సీఎంగా ఉంటార‌ని ఎమ్మెల్యే గ‌ణేష్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టేసినంత మాత్రాన ఏపీ జనాలు ఎందుకు నమ్ముతారని వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ని పేరులు మార్చినా... ఏమి చేసినా దాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు న‌మ్మ‌రు గాక న‌మ్మ‌ర‌ని తేల్చిచెప్పారు. పైగా ఏపీ రాజకీయాల్లో వచ్చే మార్పు కూడా ఏమీ ఉండ‌ద‌ని వాసుప‌ల్లి గణేష్ తెలిపారు.

ఏపీలో రాజకీయ శూన్యత లేదని.. అందువల్ల ఏపీలో బీఆర్ఎస్ అంటూ జనాల్లోకి వెళ్ళినా ఉపయోగం ఏమీ ఉండదని చెబుతున్నారు. అందువల్ల ఏ కొత్త పార్టీ వచ్చినా ఆయాసపడడమే తప్ప వైసీపీని ఎవరూ ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు.

మ‌రోవైపు ఇప్ప‌టికే తాము ఏ ఫ్రంట్‌లో, ఏ కూట‌మిలో చేర‌బోమ‌ని వైసీపీ ముఖ్య నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైసీపీ ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే గ‌ణేష్ కుమార్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని భావిస్తున్నారు.

కాగా 2014, 2019 ఎన్నిక‌ల్లో విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుప‌ల్లి గణేష్ కుమార్ ప్ర‌స్తుతం వైసీపీతో అంట‌కాగుతున్నారు. ఆ పార్టీకి అనుబంధ స‌భ్యుడిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News