అయ్యో.. హతవిధీ అలీ.. ఎంత పని జరిగింది?

Update: 2022-05-18 03:09 GMT
ఇప్పుడు అంతా అయ్యో అలీ.. ఎంత పని జరిగింది అంటూ చర్చించుకుంటున్నారు. ప్రముఖ నటుడు అలీకి అంత కష్టమేమొచ్చిందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభకు తన పార్టీ తరఫున నలుగురు సభ్యులను ఎంపిక చేసింది. ఇద్దరు తమ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారికి, మరో ఇద్దరు బీసీలకు చాన్స్‌ ఇచ్చింది.

వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత, ప్రస్తుతం ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి మరోసారి రాజ్యసభ బెర్త్‌ దక్కించుకున్నారు. ఇక తనపై ఉన్న అవినీతి కేసుల్లో మొదటి నుంచి తనకు చేదోడువాదోడుగా ఉంటున్న లాయర్‌ నిరంజన్‌రెడ్డికి కూడా జగన్‌ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన బీద మస్తాన్‌రావుకు కూడా రాజ్యసభ సీటు దక్కింది.

ఇక వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్లను పెద్ద మొత్తంలో కొల్లగొట్టడానికి ప్రస్తుతం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆర్‌.కృష్ణయ్యకు కూడా ఏపీ సీఎం జగన్‌ రాజ్యసభ సీటు కేటాయించారు. అయితే.. తనకు పదవి వస్తుందని చకోర పక్షిలా ఎదురుచూస్తున్న అలీకి మాత్రం జగన్‌ జెల్లకొట్టారు. అలీకి రాజ్యసభ సీటు పక్కా అని ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు సినిమా రంగం నుంచి, ఇటు మైనార్టీ వర్గం నుంచి అలీకి సీటు ఇస్తే రెండు విధాల లాభం ఉంటుందని వైఎస్‌ జగన్‌ తలపోశారని చెప్పుకున్నారు.

ఇందులో భాగంగా అలీని పలుమార్లు తాడేపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని సీఎం జగన్‌ మాట్లాడారు. సినిమా టికెట్‌ రేట్ల పెంపు అంశంపై జగన్‌తో మాట్లాడటానికి స్టార్‌ హీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్‌ తదితరులు వచ్చినప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి పోసాని కృష్ణమురళి, అలీలకు కూడా ఆహ్వానం అందింది. ఆ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.. అలీ. మరోమారు సీఎం జగన్‌ తనను వచ్చి కలవమన్నారని మీడియాతో చెప్పారు కూడా. దీంతో రాజ్యసభ సీటు అలీకి కన్ఫర్మ్‌ అయిందని వైఎస్సార్‌సీపీ అనుకూల మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

స్టార్‌ హీరోలు వైఎస్‌ జగన్‌ను కలిసిన కొద్ది రోజులకే అలీ మరోమారు ఒంటరిగా వచ్చి సీఎం జగన్‌ను కలిశారు. కొద్ది రోజుల్లో పార్టీ నుంచి మీకు ఫోన్‌ వస్తుందని, రెడీగా ఉండమన్నారని అలీ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. దీంతో అలీకి రాజ్యసభ బెర్త్‌ పక్కాగా ఫిక్స్‌ అని అందరికీ అర్థమైపోయింది.

తీరా సీన్‌ కట్‌ చేస్తే.. అలీకి నిరాశే ఎదురైంది. వచ్చే జూన్‌లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. టీజీ వెంకటేష్, సురేష్‌ ప్రభు, విజయసాయిరెడ్డి, సుజనా చౌదరిల పదవీ కాలం ముగుస్తుంది. ఈసారి నాలుగు సీట్లు వైఎస్సార్‌సీపీకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ వైఎస్సార్సీపీ తరఫున నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే ఎంతో ఆశ పెట్టుకున్న అలీకి మాత్రం జెల్లకొట్టారు.

వాస్తవానికి.. గతంలోనే అలీకి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా అవకాశమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కూడా అలీకి నిరాశే ఎదురైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అలీ ఆంధ్రప్రదేశ్‌లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అయినా ఫలితం శూన్యం.
Tags:    

Similar News