వైసీపీ-టీడీపీల్లో కుప్పం క‌ల‌క‌లం..!

Update: 2022-01-09 02:30 GMT
టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరుజిల్లాలోని కుప్పంపై.. ఇటు టీడీపీలోను.. అటు అధికార పార్టీలోనూ గుబులు నెల‌కొంది. దాదాపు 35 ఏళ్లుగా.. త‌న‌కు ప‌ట్టం క‌డుతున్న ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎక్క‌డ చేజారి పోతుందో.. అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు దిగులు పెట్టుకున్నారు. అదేస‌మ‌యంలో జిల్లా మొత్తానికి కేటాయించే నిధుల్లో సింహ భాగం.. ఈ ఒక్క నియోజ‌వ‌ర్గంలోనే ఖ‌ర్చు పెడుతున్నారు వైసీపీ మంత్రులు, ఎంపీ కూడా! అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి ప్ర‌జ‌ల మూడ్ మారితే త‌మ‌కు ఇబ్బందేనని వారు గుబులు చెందుతున్నారు. వెర‌సి ఈ రెండు ప్ర‌ధాన పార్టీల్లోనూ కుప్పం క‌ల‌క‌లం రేపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న జిల్లా క‌డ‌ప‌పై క‌న్నేశారు. ఎలాగైనా.. ఇక్క‌డ సైకిల్‌ను ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించారు. అంటే.. జ‌గ‌న్‌ను త‌న సొంత జిల్లాలోనే ఓడ‌గొట్టి.. తాను పైచేయి సాధించాల‌ని భావించారు. దీంతో నిధుల‌ను ఈ జిల్లాపై పారించారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు నుంచి పులివెందుల‌కు నీటిని కూడా ఇచ్చారు. ర‌హ‌దారుల‌ను అద్దాల‌ను త‌ల‌పించేలా చేశారు. క‌డ‌ప‌లో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి ఆగ‌మేఘాల‌పై శంకు స్థాప‌న చేశారు.

అప్ప‌టి టీడీపీ నేత‌.. సీఎం ర‌మేష్‌తో దీక్ష కూడా చేయించారు. దీంతో జ‌గ‌న్‌పై ఉన్న కోపంతో ఇక్క‌డ అభివృద్ధిని చేయించారు.. చంద్ర‌బాబు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇక్క‌డ ప‌ట్టు సాధించ‌లేక పోయారు. ఇక‌, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు సొంత నియోజ‌వ‌ర్గాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. చిత్తూరు జిల్లాకు ఎక్కువ‌గా నిధులు కేటాయించారు. వీటిలోనూ సింహ‌భాగం .. ఆయ‌న నియోజక‌వ‌ర్గం కుప్పానికే.. ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. నిధులు పారించారు. అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల‌లో విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు త‌ర‌చుగా చంద్ర‌బాబు అక్క‌డ ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ.. త‌న సింప‌తీని పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప్లేట్ ఫిరాయిస్తే.. త‌మ హ‌వా సాగుతుందా? అనే త‌ర్జ‌న భ‌ర్జ‌న వైసీపీలోనూ కొన‌సాగుతోంది. మొత్తానికి ఇద్ద‌రి నేత‌ల వైరంతో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా అభివృద్ధిలో ముందుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. పార్టీల్లో మాత్రం గుబులు కొన‌సాగుతుండ‌డం విశేషం.


Tags:    

Similar News