కేరళలోని దేవాలయాల్లో తరతరాలుగా అగ్రవర్ణాల వారు అర్చక బాధ్యతలు నిర్వహించడం ఆనవాయితీ. ఇప్పటివరకు అక్కడి ఆలయాల్లో దళితులు అర్చక బాధ్యతలు నిర్వహించలేదు. ఆ మాటకొస్తే 81 ఏళ్ల క్రితం వరకు కేరళలోని ఆలయాల్లో దళితులకు కనీసం ప్రవేశం కూడా లేదు. ఈ నేపథ్యంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు - కట్టుబాట్లకు స్వస్తి పలుకుతూ కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఓ ఆలయానికి బ్రాహ్మణేతరుడిని అందులోనూ దళితుడిని నియమించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ట్రావెన్ కోర్ దేవాలయ మండలి పరిధిలో ఆరుగురు దళితులతో సహా 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా ఎంపిక చేసి నవశకానికి నాంది పలికింది. తాజా నిర్ణయంతో కేరళ ప్రభుత్వం దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
కేరళలోని ట్రావెన్ కోర్ దేవాలయ మండలి.....శబరిమల అయ్యప్పస్వామి ఆలయం సహా మొత్తం 1248 దేవాలయాలను పర్యవేక్షిస్తోంది. ఆ ఆలయాలలో అన్ని కులాలవారిని నియమించాలని ఇటీవలి కాలంలో డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆరుగురు దళితులతో సహా 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించింది. ఆ దళితులలో ఒకరైన ఏదు కృష్ణన్ (22) తిరువళ్లకు సమీపంలోని మణప్పురం శివాలయ అర్చకుడిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో, కేరళలో తొలి దళిత పూజారిగా చరిత్ర సృష్టించారు. పదేళ్లుగా తంత్రశాస్త్రంలో శిక్షణ పొందిన ఏదు కృష్ణన్ ప్రస్తుతం సంస్కృతంలో పీజీ చివరి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. తన గురువు కేకే అనిరుద్ధన్ తంత్రి నుంచి ఆశీర్వాదం పొందాక కృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఆలయ ప్రధాన అర్చకులు గోపకుమార్ నంబూద్రి మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణన్ ఆలయ ప్రవేశం చేశారు. నంబూద్రితో కలిసి ఆయన ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. 1936 నవంబరు 12న ట్రావెన్ కోర్ సంస్థానం నిమ్నకులాల వారికి కూడా ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తూ శాసనం చేసింది. సరిగ్గా ఆ ప్రకటన వెలువడిన 81 ఏళ్ల అనంతరం దళిత వ్యక్తి పూజారిగా బాధ్యతలు స్వీకరించటం విశేషం.