YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

Update: 2020-03-10 05:56 GMT
దేశంలో ఒకవైపు కరోనా వైరస్ దెబ్బకి అందరూ భయంతో వణికిపోతుంటే ..మరోవైపు ఎస్ బ్యాంక్ దెబ్బ కూడా అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గత కొన్ని రోజులుగా సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంక్ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. దీనితో పలువురు ఎస్ బ్యాంక్ ఖాతాదారులు లబోధింబోమంటున్నారు. తాజాగా ఎస్ బ్యాంక్ బాధితుల్లో apsrtc కూడా చేరింది. గతంలో అధిక వడ్డీకి ఆశపడి , apsrtc ఎస్ బ్యాంక్ లో లావాదేవీలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు.

తాజాగా రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీసీ అధికారులకు బ్యాంకు షాకిచ్చింది. రూ.50 వేలకు మించి తీసుకోటానికి వీలులేదని బ్యాంకు సిబ్బంది చెప్పటంతో అధికారులకు దిమ్మతిరిగింది. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. డీజిల్‌ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళన వారిలో మొదలైంది. విజయవాడలోని యస్‌ బ్యాంకు హెడ్‌ ఆఫీసులో అకౌంట్‌ ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోంది. ఎప్పుడూ ఓడీలు వాడుకునే సంస్థకు జనవరి 2020 నుంచి సిబ్బంది జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుండటంతో అకౌంట్లో నిధులు నిల్వచేసుకునే అవకాశం లభించింది. జనవరి నెలకు సంబంధించిన జీతం ప్రభుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120కోట్లు యస్‌ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతాలో జమ అయింది.

దీంతోపాటు రోజువారీ వచ్చిన కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు బ్యాంకు లో డిపాజిట్‌ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో 40కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్‌ ఖాతాకు బదిలీ చేశారు. దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240కోట్లు యస్‌ బ్యాంకులో నిల్వఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్ బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం, ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం డిపాజిటర్లకు భరోసా ఇస్తూ నెల రోజుల పాటు లావాదేవీలు అతి తక్కువ గా జరపాలని ఆంక్షలు పెట్టింది. దీని ఫలితం గా అకౌంట్స్ లో కోట్లు పెట్టుకొని కూడా రూ.50వేలకు మించి తీసుకోలేని పరిస్థితి వచ్చింది. దీనితో సాధారణంగా జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను వడ్డీకీ ఆశపడి, ఇలాంటి బ్యాంకుల్లోకి మార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కేంద్రం చెప్పిన నెల సమయం తరువాత అయినా కూడా ఆ మొత్తం డబ్బు వస్తుందో రాదో అని ఆర్టీసీ వర్గాలు ఆందోళనలో ఉన్నారు.
Tags:    

Similar News