యోగీ మార్కు...మోదీ మార్కును దాటేసిందిగా!

Update: 2017-08-30 04:53 GMT
హిందూత్వ వాదిగా మొన్న‌టిదాకా మ‌న‌కు చిర‌ప‌ర‌చితులైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి... ఐదు ప‌ర్యాయాలు ఎంపీగా ప‌నిచేసినా రాని గుర్తింపు... సీఎం ప‌ద‌వి చేప‌ట్టిన ఏడాదికే వ‌చ్చేసింద‌న్న మాట వినిపిస్తోంది. యూపీలో బీజేపీ నేతృత్వంలో సాగుతున్న ప్ర‌భుత్వానికి నాయ‌కులుగా బరిలో నిలిచిన వారిలో అప్ప‌టిదాకా యోగీ ఆదిత్య‌నాథ్ పేరే లేదు. చివ‌రాఖ‌రులో ఈ జాబితాలోకి అనూహ్యంగా వ‌చ్చి చేరిన యోగీ... అంద‌రినీ వెన‌క్కు నెట్టేసి ప‌ద‌వి చేజిక్కించుకోవ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే చెప్పాలి. హిందూత్వ వాదిగా ముద్ర‌ప‌డిన యోగీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో యూపీలో ఇక ముస్లింల‌కు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపించింది. అయితే ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఎలా ఉన్నా... సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌రుక్ష‌ణ‌మే యోగీ త‌న స్టైల్‌ ను మార్చేశారు.

హిందూత్వ వాది ముద్ర నుంచి మంచి పాల‌కుడిలా పేరు తెచ్చుకునేందుకు ఆయ‌న ప‌క్కాగా ప‌థ‌కం ర‌చించుకుని ముందుకు సాగుతున్న‌ట్లుగా ఇటీవల యూపీలో చోటుచేసుంటున్న ప‌రిణామాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో నిరుద్యోగులు కూడా పెద్ద సంఖ్య‌లోనే ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ అంచ‌నాల ప్ర‌కారం ఆ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య కోటి దాకా ఉంద‌ట‌. మ‌రి వీరంద‌రికీ ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మెలా అన్న కోణంలో ఇప్ప‌టిదాకా ఆలోచించిన పాల‌కులే లేర‌న్న వాద‌న ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని పార‌దోలేందుకు యోగీ ఓ స‌రికొత్త ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. *వ‌న్ డిస్ట్రిక్ట్‌- వ‌న్ ప్రాడ‌క్ట్* పేరిట నామ‌క‌ర‌ణం అయిన ఈ ప‌థ‌కం ద్వారా రానున్న ఐదేళ్ల‌లోనే రాష్ట్రంలోని 70 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి క‌ల్పిస్తాన‌ని యోగీ చెప్పారు.

రోజ్‌ గార్ స‌మ్మిట్ పేరిట నిన్న ల‌క్నోలో జ‌రిగిన ఓ కీల‌క స‌ద‌స్సులో యోగీ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం ప్ర‌కారం ఒక జిల్లాలో ఒక్క ఉత్ప‌త్తికి మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తార‌ట‌. ఆయా జిల్లాల్లోని మౌలిక వ‌స‌తులు - స‌హ‌జ వ‌న‌రుల‌ను ఆధారం చేసుకుని ఈ ప‌థ‌కాన్ని ప‌క్కాగా అమ‌లు చేసేందుకు కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించిన‌ట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. అయినా అంత‌గా ఓ ఉత్ప‌త్తికి సంబంధించి స‌హ‌జ వ‌న‌రులు లేని జిల్లాల్లో స‌ద‌రు ఉత్ప‌త్తికి సంబంధించిన ప‌రిశ్ర‌మ‌ల‌ను ఎందుకు ఏర్పాటు చేయాలంటూ కూడా యోగీ ఆసక్తిక‌ర ప్ర‌సంగం చేశారు. మొత్తం రాష్ట్రంలోని 75 జిల్లాల్లో ఏఏ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహం ఇవ్వాల‌న్న విష‌యంపై ఇప్ప‌టికే ప‌క‌డ్బందీ క‌స‌ర‌త్తు పూర్తి చేశామ‌ని చెప్పిన యోగీ... దానిని ప‌క్కాగా అమ‌లు చేసి రాష్ట్రం నుంచి నిరుద్యోగాన్ని పార‌దోల‌తామ‌ని చెప్పారు. చూద్దాం మ‌రి... యోగీ ఈ ప‌థ‌కం ద్వారా యూపీలోని నిరుద్యోగాన్ని ఏ మేర‌కు పార‌దోల‌తారో?
Tags:    

Similar News