మోడీ కాన్వయ్ లో ఎంటరై పాంప్లేట్స్ విసిరాడు

Update: 2016-12-23 04:50 GMT
ప్రధాని వస్తున్నారంటే భద్రతా ఏర్పాట్లు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రధాని రాకకు ఒక రోజు ముందే.. ఆయన పర్యటించే ప్రాంతాల్ని భద్రతా వర్గాలు తమ అధీనంలోకి తీసుకుంటాయి. మరి.. అంతలా భద్రతను ఏర్పాటు చేసినా.. ఒక యువకుడు కరపత్రాల్ని ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో.. ఆ వాహనాల మీద పడేలా విసరటం అంటే..? నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్లు? భద్రతా వర్గాలు ఏం చేస్తున్నట్లు. యూపీలో ఆయన జరిపిన తాజా పర్యటన సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

ప్రధాని కాన్వాయ్ కబీర్ నగర్ ప్రాంతానికి వచ్చిన వేళ.. ఇరవై ఏళ్లు ఉన్న వ్యక్తి మోడీ కాన్వాయ్ పైకి కరపత్రాలు విసిరిన వైనం సంచలనంగా మారింది.అతడ్ని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించినా.. వారికి చిక్కకుండా తప్పించుకోవటం గమనార్హం. ఇక.. ప్రధాని కాన్వాయ్ మీద పడిన కరపత్రంలో వివిధ అంశాలపై తనకున్న ఆగ్రహాన్ని సదరు యువకుడు ప్రస్తావించాడు.

తన పేరు అభినవ్ త్రిపాఠీగా..తానో సామాజిక కార్యకర్తగా చెప్పుకొన్న ఆయన.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘కాశీలో మీ పర్యటనను వ్యతిరేకిస్తున్నామని గుర్తించండి. కాశీలో పేదలు బ్యాంకు అధికారుల చేతిలో వేధింపులకు గురి అవుతున్నారు. ఆలయాలను.. మసీదులను.. చర్చిలను.. గురుద్వారాలను నియంత్రిస్తున్న నేరగాళ్లపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కీలక పోస్టులకు అనుమానాస్పద వ్యక్తుల్ని నియమిస్తున్నారు. వందల కోట్ల విలువైన పథకాల్ని  ప్రకటిస్తున్నా.. యువతకు ఉద్యోగ అవకాశాలు లభించటం లేదు’’ అంటూ తన అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని లాంటి వ్యక్తి కాన్వాయ్ లోకి చొరబడి పాంప్లేట్ విసిరి.. మోడీ కాన్వాయ్ లో ప్రయాణించే వాహనం మీద పడేలా చేయగలగటం చూస్తే.. సెక్యూరిటీలో ఏదో లోపం ఉన్నట్లు అనిపించట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News