జగన్.. బాబుల సినిమాస్త్రాలు... ?

Update: 2022-04-03 16:30 GMT
సినిమా పవర్ ఫుల్ మీడియం. అక్కడ ఏం చెబితే అది జనాల మెదళ్లలోకి ఎంతో కొంత వెళ్తుంది అన్న భావన నమ్మకం ఈ రోజుకీ రాజకీయ జీవులకు ఉంది. అందుకే వచ్చే ఎన్నికల కోసం మరో సారి సినిమాలను ఏపీలోని ప్రధాన పార్టీలు నమ్ముకున్నాయని అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే జగన్ పాలనలో సంక్షేమ పధకాలు ఎలా పెద్ద ఎత్తున అమలు అవుతున్నాయన్న కాన్సెప్ట్ మీద సినిమా ఒకటి పాజిటివ్ మానర్ లో వైసీపీ నేతలు తీయాలని అనుకుంటున్నారుట.

ఈ రకంగా జగన్ సర్కార్ కి ప్రోగా సినిమా తీయడానికి ఆ పార్టీలో కీలకనేత ఒకరు ముందుకు వచ్చారని అంటున్నారు. ఆ నాయకుడు గతంలో కొన్ని చిన్న సినిమాలు తీసి ఉన్నారని అంటున్నారు. జగన్ కి 2024 ఎన్నికల్లో విజయం కోసం సినిమా తీస్తామని ఆయన అంటున్నట్లుగా చెబుతున్నారు.

అయితే దీని మీద అధినాయకత్వం నుంచి ఎలాంటి సూచనా రాలేదు అని తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు వైసీపీ సర్కార్ విజయాల మీద సినిమా తీసి రిలీజ్ చేసే ఆలోచన అయితే ఆ పార్టీలో ఉందని తెలుస్తోంది. ఈ రకంగా జగన్ కళ్లలో పడి తన రాజకీయ అవకాశాలు పెంచుకోవడానికి సదరు నాయకుడు చూస్తున్నారని అంటున్నారు.

ఇక టీడీపీని పెట్టిందే సినీ నటుడు ఎన్టీయార్. ఆ పార్టీకి ఈ రోజుకీ సినీ దన్ను చాలానే ఉంది. బాలయ్య, జూనియర్ ఎన్టీయార్ వంటి టాప్ స్టార్స్ టీడీపీ వైపు ఉన్నారు. ఇక ప్రఖ్యాత దర్శకుడు కె రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత సి అశ్వనీదత్ లాంటి వారు అయితే చంద్రబాబు ఏపీకి సీఎం కావాలని కోరుకుంటున్నారు. మీరు యాక్షన్ అనండి సార్ మేము రంగంలోకి దిగిపోతామని ఈ మధ్యనే ఒక సభలో వారు బాబుకు డైరెక్ట్ గా  చెప్పేశారు.

సో సినిమా పరంగా ఈసారి టీడీపీకి భారీ మద్దతు దక్కుతుంది అని అంటున్నారు. ఇక ఏపీలో జగన్ పాలన మీద పూర్తిగా నెగిటివ్ టచ్ ఇస్తూ ఒక సినిమా అయితే టీడీపీ సైడ్ నుంచి ఎన్నికల వేళకు వస్తుంది అని తెలుస్తోంది. దానికి చాలా కాలం క్రితం టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన ఒక ప్రముఖ సినీ నిర్మాత పూనుకుంటారు అని అంటున్నారు.

అంటే వచ్చే ఎన్నికలకు రాజకీయ అస్త్రాలుగా సినిమాలు ఎవరి శక్తి మేరకు వారు అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి వాడేసుకుంటారు అని పక్కా క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే బాలయ్య 2019 ఎన్నికల ముందు టీడీపీ కోసమే అన్నట్లుగా కధా నాయకుడు, మహానాయకుడు మూవీస్ తీశారు కానీ అవి క్లిక్ అవలేదు, వైసీపీ తరఫున అన్నట్లుగా  యాత్ర అని కొందరు తీశారు. అది కూడా ఒక మోస్తరుగా ఆకట్టుకుంది.  

ఇపుడు బాలయ్య బోయపాటి కాంబోలో ఎన్నికల వేళకు ఫక్తు రాజకీయ కధాంశంతో ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుంది అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.  మరి ఎవరైనా  సినిమాల ద్వారా ప్రచారం చేసి జనాలను మాయాజాలంతో ముంచెత్తగలరా. తమ వైపునకు తిప్పుకుని బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు వేయించుకోగలరా. అంటే చూడాలి మరి.
Tags:    

Similar News