మ‌హిళ‌ల‌కే పెద్ద‌పీట‌.. జ‌గ‌న్ ఎన్నిక‌ల వ్యూహం స్టార్ట్‌

Update: 2021-07-18 00:30 GMT
ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు అనూహ్యంగా మారుతున్నాయా?  వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ‌చ్చే 2024 ఎన్నిక‌ల ను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మ‌కంగా అప్పుడే అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక్క ఛాన్స్‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌.. విజ‌యం ద‌క్కించుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. రాష్ట్రానికి సంబంధించి ఆయ‌న వేస్తున్న అడుగులు, చేస్తున్న పాల‌న‌పై మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు స‌హా మేధ‌వి వ‌ర్గాల్లోనూ వ్య‌తిరేక‌త పొడ‌చూపుతోంది.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేరుగా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చినా.. వ్య‌తిరేక‌త త‌ప్పేలా క‌నిపించ‌డం లేద‌ని ఇటీవ‌ల కాలంలో విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ వ్య‌తిరేక‌త‌ను త‌ప్పించుకునేందుకు జ‌గ‌న్‌.. మ‌హిళ‌ల‌ను మ‌చ్చిక చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్రారంబించిన అనేక ప‌థ‌కాలు, సంక్షేమా కార్య‌క్ర‌మాల‌ను కూడా మ‌హిళ‌ల‌నే కేంద్రంగా చేసుకుని అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన స్తానిక ఎన్నిక‌ల్లోనూ చైర్మ‌న్లుగా, కౌన్సిల‌ర్లుగా, కార్పొరేష‌న్ మేయ‌ర్లుగా కూడా మ‌హిళ‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు `దానికి మించి` అన్న త‌ర‌హాలో నామినేటెడ్ ప‌ద‌వులను మ‌హిళ‌ల‌కు భారీ సంఖ్య‌లో కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ప్ర‌క‌టించిన నామినేటెడ్ సీట్ల‌లో మెజారిటీ భాగాన్ని.. అత్యంత కీల‌క‌మైన విభాగాల‌ను కూడా మ‌హిళ‌ల చేతుల్లోనే పెట్టారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు లైమ్‌లైట్‌లో లేని మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 55 శాతం ప్రకటించడం గమనార్హం. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పోస్టులు కేటాయించారు. 68 మహిళ‌ల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాని మ‌హిళ‌లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా రెడ్డి పద్మావతి, ఏపీ ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌గా గేదెల బంగారమ్మ, ఏపీ వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల, ఏపీ బుడా చైర్మన్‌గా ఇంటి పార్వతి,  మహిళా కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ చైర్మన్‌గా హేమమాలిని,  
ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండి పుణ్యసుశీల, డీసీఎంఎస్‌ చైర్మన్‌గా అవనపు భావన, తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా నరమల్లి పద్మజ,  సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి,  పశ్చిమ డెల్టా బోర్డు చైర్మన్‌గా గంజిమాల దేవి, ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్‌ పర్సన్‌గా శైలజ  వంటివారు కీల‌క ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. దీనిని లోతుగా ప‌రిశీలిస్తే.. 2024 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే వీరికి ఈ ప‌ద‌వులు అప్ప‌గించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ వ్యూహం స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News