జగన్ కూ పరిణతి వచ్చింది

Update: 2015-09-04 11:30 GMT
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా కాస్త పరిణతి వచ్చింది. అసెంబ్లీలో ఈసారి దానిని ఆయన ప్రదర్శించాడు. గత సమావేశాల్లో అధికార పక్షం విమర్శలు చేసినప్పుడు.. తన కేసులు ప్రస్తావించినప్పుడు ఉడుక్కుని రెచ్చిపోయిన జగన్.. ఈసారి వాటిని పట్టించుకోనట్లు ప్రవర్తించి తన లక్ష్యంపైనే దృష్టి సారించాడు.

నవ్యాంధ్ర అసెంబ్లీలో ఇప్పటి వరకు అధికార టీడీపీ నేతలు జగన్ నే ఇరుకున పెట్టేవాళ్లు. వైసీపీని ఆత్మ రక్షణలోకి నెట్టాలంటే ఆయన కేసులను ప్రస్తావించేవాళ్లు. అసెంబ్లీలో జగన్ తప్ప మిగిలిన వాళ్లు ఎవరూ మాట్లాడరు కనక.. జగన్ ను టార్గెట్ చేసుకునే విమర్శలు గుప్పించేవాళ్లు. కాల్వ శ్రీనివాసులు - యనమల రామకృష్ణుడు - అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైనా.. జగన్ కేసులను ప్రస్తావించడం.. ఆయన జైలు జీవితాన్ని గుర్తు చేయడం.. ఆయన లక్ష కోట్లను గుర్తు చేయడం.. వాటితోపాటు ఆయన తండ్రి వైఎస్ ను తిట్టడం చేసేవాళ్లు. దాంతో జగన్ రెచ్చిపోయి అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించేవాడు. దాంతో మరోసారి అధికార పక్షానికి దొరికిపోయి ప్రజల్లోనూ పలుచన అయ్యేవాడు.

ఈసారి మాత్రం జగన్ ఆత్మ రక్షణలోకి వెళ్లలేదు. అధికార పక్షాన్నే ఆత్మ రక్షణలోకి నెట్టాడు. ఈసారి జగన్ మాట్లాడుతున్నప్పుడు కూడా అధికార పక్ష నేతలు ఆయన ఎప్పట్లాగే ఆయన కేసులు.. జైలు జీవితం తదితరాలపై విమర్శలు చేశారు. మధ్య మధ్యలో జోక్యం చేసుకుని యనమల వంటివాళ్లు ఆయనను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారు. అయినా ఈసారి జగన్ తన ప్రసంగానికే పరిమితమయ్యాడు. అధికార పక్ష నేతల విమర్శలకు ఒక్క మాటలో జవాబు చెప్పినా.. వెంటనే సబ్జక్టులోకి వెళ్లిపోయాడు. అక్రమాస్తుల జప్తు విషయంలోనూ పెద్దగా జోక్యం చేసుకోలేదు. కానీ, చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరుకున పెట్టడానికే ప్రయత్నించాడు. అందులోనూ విజయవంతమయ్యాడు. చంద్రబాబు కూడా ఆత్మ రక్షణలో పడడంతో ఈసారి జగన్ పరిణతి చెందినట్లు కనిపించాడు.

                                                  అసెంబ్లీలో వైసీపీదే పైచేయి

నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు అధికార పక్షం పైచేయి సాధిస్తే.. తొలిసారిగా ప్రతిపక్ష వైసీపీ పైచేయి సాధించింది. అసెంబ్లీని ఎదుర్కోలేక ఐదు రోజుల్లోనే సమావేశాలను ముగించేయడం ఇందుకు ఒక నిదర్శనం. ప్రతిపక్షం ఓటుకు నోటును ప్రస్తావిస్తే తమకు చిక్కులు తప్పవని భావించిన టీడీపీ.. సమావేశాలను ఐదు రోజులకే కుదించింది. ఈ ఐదు రోజుల్లోనూ రెండు రోజులు ప్రత్యేక హోదా.. రెండు రోజులు పట్టిసీమ.. ఒకరోజు గందరగోళం తప్ప.. సమావేశాల వల్ల ఒరిగిందేమీ లేదు. నవ్యాంధ్రను కరువు తీవ్రస్థాయిలో పట్టిపీడిస్తోంది. దానిపై అధికార, ప్రతిపక్షాలు ఏమాత్రం చర్చించలేదు. సాగునీరు, తాగునీటి కరువు వంటి ప్రజా సమస్యలను ఏమాత్రం ప్రస్తావించలేదు. వాటిని చర్చించడానికి అనుగుణంగా సమావేశాలను పొడిగించడానికి కూడా అధికార పక్షం సుముఖత వ్యక్తం చేయలేదు. ఇందుకు కారణం.. ఈసారి సమావేశాలను ఎంత పొడిగిస్తే  తమకు అంత నష్టమని టీడీపీ భావించడమే. ప్రత్యేక హోదా విషయంలో జగన్ పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. గోదావరి పుష్కరాల అంశం చర్చకు వస్తే ప్రతిపక్షానికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓటుకు నోటు అంశం చర్చకువస్తే తాము అసలు జవాబు చెప్పుకోలేని అంశం. ఆ అంశం అసలు అసెంబ్లీలో చర్చకు రావడం కూడా అధికార పక్షానికి ఇష్టం లేదు.

ఎటువంటి అంశాలూ చర్చకు రాకుండా ఐదు రోజులకు పరిమితం చేయడం ఒ:క అంశం అయితే.. చర్చల సందర్భంగా కూడా ఎప్పట్లాగే అధికార పక్షం జగన్ మీద ఎదురు దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ, ఈసారి పూర్తి స్థాయిలో విఫలమైంది. అచ్చెన్నాయుడు ఎదురు దాడి కూడా పనిచేయలేదు. అధికార పక్షం ఎదురు దాడి చేసినా జగన్ దానికి లొంగలేదు. టీడీపీని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా తన వాదనకు తాను కట్టుబడి దానిని పూర్తి చేయడానికే పెద్దపీట వేశారు. పట్టిసీమ విషయంలో తొలి రోజు విఫలమైనా రెండో రోజు దానిని సరిదిద్ది పైచేయి సాధించాడు. పట్టిసీమ విషయంలో తన వాదనను కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

                                            అసెంబ్లీలో టీడీపీ తప్పటడుగులు

అసెంబ్లీలో ఈసారి అధికార టీడీపీ తప్పటడుగులు వేసింది. అసెంబ్లీ లాబీల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో విషయంలోనూ అనవసర రాద్ధాంతం కారణంగా చివరికి ఏమీ చేయలేని పరిస్థితికి చేరింది.

అసెంబ్లీ లాబీల్లో స్పీకర్ల ఫొటోలు మాత్రమే ఉండాలి. ముఖ్యమంత్రుల ఫొటోలు పెట్టకూడదు. ఈ నిబంధనలు ఉన్నా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ మీద అభిమానంతో ఆయన ఫొటోను పెట్టారు. అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయని టీడీపీ.. అధికార హోదాలో ఇప్పుడు తొందరపాటును ప్రదర్శించింది. హైదరాబాద్ లో అసెంబ్లీ మరి ఎన్నాళ్లో కొనసాగదు. ఇక్కడ అసెంబ్లీ శాశ్వతం ఏమీ కాదు. అయినా, అసెంబ్లీ లాబీల్లోంచి వైఎస్ ఫొటోను తొలగించడం ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరో ఏడాదిలో నవ్యాంధ్రలో తాత్కాలిక అసెంబ్లీకి వెళ్లినప్పుడు కానీ.. శాశ్వత అసెంబ్లీని నిర్మించినప్పుడు కానీ అక్కడ నిబంధనల ప్రకారమే ఫొటో పెట్టవచ్చు. కానీ, వివాదం చేయడానికే హడావుడిగా హైదరాబాద్లోని అసెంబ్లీలో ఫొటో తీసేసింది.

ఆ తర్వాత అయినా దానిని సరిపెట్టుకోవడంలో విఫలమైంది. దానిపై కేవీపీ వరుస లేఖలురాసినా స్పందించలేదు. వైసీపీ సభ్యులు లాబీల్లో వైఎస్ ఫొటో పెట్టినప్పుడు సమర్థంగా వ్యవహరించలేదు. అసెంబ్లీ ముగిసిన తర్వాత చివరి రోజు కేవీపీ పైనా, వైసీపీ నేతలపైనా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. అయితే, అసెంబ్లీ లాబీల్లో వైఎస్ ఫొటోలను పెట్టింది వ్యక్తులు కాదని, వైసీపీ శాసనసభాపక్షమని జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి వస్తే మొత్తం శాసనసభాపక్షంపై చర్యలు తీసుకోవాలి. కొంతమంది వ్యక్తులను బయటకు పంపించడానికి వీలుండదు. తద్వారా వైఎస్ ఫొటో విషయంలో కూడా ఎవరిపైనా చర్యలుతీసుకోలేని సందిగ్ధంలో అధికార పార్టీ చిక్కుకుంది.
Tags:    

Similar News