బాబు పై జగన్ ‘ఎన్టీఆర్ వీడియో బాంబ్’

Update: 2019-06-13 08:20 GMT
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ గా తమ్మినేని సీతారం ఎన్నిక సామరస్యంగానే జరిగినా.. ఆయనకు ధన్యవాదాలు తెలిపే తీర్మాణం మాత్రం రచ్చకు దారితీసింది. సీఎం జగన్ తొలి ప్రసంగంలోనే టీడీపీ పై- చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.. 2014లో గెలిచిన మా 23మంది ఎమ్మెల్యేలను ఇదే చట్టసభలో కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకొని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు విలువలను కాలరాశాడని పరుష వ్యాఖ్యలతో జగన్ ఏకిపారేశారు..

అయితే దీనికి కౌంటర్ గా సభలో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గతంలోని విషయాలను ప్రస్తావించారు. 1978లో రెడ్డి కాంగ్రెస్ పై గెలిచిన రాజశేఖర్ రెడ్డి కేవలం నాలుగురోజులకే ఇందిర కాంగ్రెస్ లో చేరారని కౌంటర్ ఇచ్చారు.

దీనిపై చంద్రబాబు కూడా జగన్ కు పాత విషయాలను గుర్తుకు తెచ్చారు.  మీ నాన్న వైఎస్ పేరును, ఆదర్శాలను తీసుకున్న జగన్.. ఆయన చేసిన పనులను కూడా తీసుకోవాలని తప్పించుకుంటే కుదరదు అంటూ ఎద్దేవా చేశారు.

దీనిపై ఫైర్ అయిన సీఎం జగన్ వెంటనే లేచి..‘గతంలో ముఖ్యమంత్రిగా సభా మర్యాదలు, పార్టీ ఫిరాయింపులను నియంత్రించాల్సిన మీరు.. ఇదే నిండుసభలో 2014లో సంతలో గొర్రెలను కొన్నట్టు మా ఎమ్మెల్యేలను కొని ఏకంగా మంత్రులను చేశారని.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ’జగన్ ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి టీడీపీ నేతలది కుక్క తోక వంకర అనే లాగానే ఉందని జగన్ ఫైర్ అయ్యారు.

ఇక అంతేకాకుండా మీరు ఇలానే పాత విషయాలను, 1978ల నాటి వైఎస్ ఉదంతాలను తవ్వితే తాను తవ్వుతానని.. ఇదే చంద్రబాబు టీడీపీని హైజాక్ చేసి వెన్నుపోటు పొడిచిన వీడియోను ఇదే అసెంబ్లీలో ప్రసారం చేయడానికి స్పీకర్ అనుమతి ఇవ్వాలని జగన్ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో సభలో వేడి రాజుకుంది. కానీ స్పీకర్ టీడీపీ, వైసీపీ పక్షాలకు సర్ధి చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.


Tags:    

Similar News