రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల సంచలన లేఖ

Update: 2022-10-27 09:31 GMT
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై 2వేల కి.మీలకు పైగా నడిచి మరీ పోరాడుతోంది వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కేసీఆర్ సర్కార్ అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అయితే ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉంది. 2వేల కి.మీలు తిరిగినా తెలంగాణ ప్రజల్లో అంత బజ్ రాలేదు. అందుకే తనతో కాని పనిని రాహుల్ గాంధీతో చేయించడానికి షర్మిల రెడీ అయ్యారు. భారత్ జోడో యాత్ర పేరిట దేశమంతా పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీని దీనికి పావుగా  వాడుకోవాలని చూస్తోంది.

తాజాగా భారత్ జోడోయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు.

ఆ లేఖ ద్వారా వైఎస్ షర్మిల రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మాట్లాడాలని సూచించారు. తన ఎజెండానే రాహుల్ పై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని.. దీనిపై  కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వైఎస్ షర్మిల లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై రాహుల్ గాంధీ తన పర్యటనలో మాట్లాడాలని వైఎస్ షర్మిల లేఖ ద్వారా పేర్కొన్నారు. 38వేల కోట్ల రూపాయలతో నిర్మించవలసిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా ఇరవై వేల కోట్లకు ఎలా పెరిగింది? అనేది కాంగ్రెస్ పార్టీ తరుఫున కూడా ప్రశ్నించాలని ఆమె పేర్కొన్నారు.

కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని వైఎస్ షర్మిల లేఖలో ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో భాగంగా రాహుల్ గాంధీకి లేఖ రాశానని వైఎస్ షర్మిల వెల్లడించారు. తెలంగాణలో పాదయాత్ర వేళ ఈ అతిపెద్ద కుంభకోణం గురించి మాట్లాడాలని కోరారు.

వైఎస్ షర్మిల మొదటి నుంచి తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంపై పడ్డారు. ఆ అవినీతిపై పోరాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలో ప్రశ్నిస్తున్నారు. 2జీ, కోల్ స్కాంలో తక్కువ కాదంటూ ఆరోపిస్తున్నారు. ఈ కాళేశ్వరంపై మాట్లాడాలని రాహుల్ ను డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాగ్ కు సైతం షర్మిల ఫిర్యాదు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News