మాట త‌ప్పే వంశం కాదు మాదిః ష‌ర్మిల‌

Update: 2017-07-09 10:30 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత షర్మిల నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు ఓ తుప్పు అని, ఇక‌పై ఆయ‌న పప్పులుడకవని ఆమె అన్నారు. ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలో లేదని, అబద్ధాలు ఆడటం తమకు చేతకాదని వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బడుగు, బలహీన వర్గాల పక్షమని, ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమన్నారు. గుంటూరులో జ‌రుగుతున్న వైసీపీ జాతీయ‌ ప్లీనరీలో రెండో రోజు ఆమె పాల్గొన్నారు. 'వేదిక మీద ఉన్న పెద్దలకు - నాయకులకు  వైసీపీ సైనికులకు, రాలేకపోయిన వైయస్ అభిమానుల‌కు.. మీ రాజన్న కూతురు - మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి, చేతులు జోడించి మనస్పూర్త‌గా నమస్కరించుకుంటోంది' అని షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

చంద్ర‌బాబు పాల‌న‌పై వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. 2014 ఎన్నికలలో  చంద్రబాబు లాగా జ‌గ‌న్‌ రుణమాఫీ చేస్తానని ఒక్క అబద్దం ఆడి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. మాట తప్పటం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే మేల‌ని జగన్ తనతో అన్న మాటలను ఆమె గుర్తు చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జగన్‌ కు ఒక్క కడపలోనే 5 ల‌క్ష‌ల మెజార్టీ వచ్చిందన్నారు. అయితే, కేవ‌లం 5 లక్షల ఓట్ల మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చిందని ష‌ర్మిల అన్నారు. ఆ త‌క్కువ మెజార్టీ కూడా చంద్రబాబు ముఖం చూసి వ‌చ్చింది కాదన్నారు. తప్పుడు వాగ్దానాలు చేస్తే ఆ మెజార్టీ వచ్చిందని , అబద్ధపు హామీలతో రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆమె ధ్వజమెత్తారు.

చంద్రబాబు అవినీతి మోడీకి కూడా తెలిసిందని, ఆయన ఇంట్లో ఉన్న ఆ ఒక్క పప్పు తప్ప మిగ‌తా ప‌ప్పులుడ‌క‌వ‌ని నారా లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు. ఆయ‌న అవినీతి ఖ్యాతి దేశమంతా వ్యాపించింద‌ని షర్మిల అన్నారు. చంద్రబాబుకు ధైర్యం లేద‌ని, ఆయనకు తెలిసింది వెన్నుపోటు పొడ‌వ‌డం మాత్ర‌మేన‌ని అన్నారు. చంద్ర‌బాబు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని, త‌న‌ తండ్రి ఎన్టీఆర్ ఫోటో చూసినప్పుడల్లా ఆమె పడే వేదన ఎవరికీ చెప్పుకోలేదని షర్మిల అన్నారు. జన్మనిచ్చిన తండ్రికి  తన భర్త వెన్నుపోటు పొడిచినా, తన తండ్రి మరణానికి ఆయ‌న‌ కార‌ణ‌మైనా ఆమె స‌హిస్తోంద‌ని, తన మాంగల్యం చూసుకొని బతికేస్తుందని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని, వాళ్లతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు.. అని వ్యాఖ్యానించారు. అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మాత్రమే చంద్రబాబుకు తెలుసని, ఆడియో-వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి ఆయన అని వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

రాజన్న మీద ప్ర‌జ‌ల‌కున్న అభిమానం.. జగనన్న మీద ఉన్న నమ్మకమే వైసీపీకి బ‌ల‌మ‌ని ష‌ర్మిల అన్నారు. వైసీపీకి  ప్రజల అండ,సహకారంతో పాటు దేవుడి దయ పుష్కలంగా ఉన్నాయ‌ని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బాణంలా దూసుకుపోదామని వైఎస్‌ షర్మిల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లంద‌రూ ఎదురుచూస్తున్న‌ రాజన్న రాజ్యం త్వ‌ర‌లో రానుంద‌ని, జగనన్న పోరాట‌మే  ఆ లక్ష్యాన్ని సాధిస్తుంద‌న్నారు. షర్మిల ప్రసంగానికి ఆద్యంతం సభికుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే, అక్కడే ఉన్న ఎమ్మెల్యే రోజా దిష్టి తీశారు. ఆపై నుదుటన తిలకం దిద్ది, విజయమ్మకు అక్షింతలు ఇచ్చి, జగన్, షర్మిల నెత్తిన వేయించారు.

Tags:    

Similar News