వివేకా కేసు- సమాచారమిస్తే రు. 5 లక్షలు !

Update: 2021-08-21 05:37 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి సీబీఐ బహుమతి ప్రకటించింది. వివేకా హత్యకు సంబంధించిన మలుపులన్నీ సీబీఐ పట్టేసిందని, కేసు కూడా ఓ కొలిక్కి వచ్చేసినట్లే అని మీడియా కథనాలు రాస్తోంది. దాదాపు 70 రోజుల పాటు సీబీఐ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి అనేకమందిని విచారించారు. ఇంకేముంది ఈరోజో రేపే నిందితులందరినీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టడమే మిగిలుందని అందరు అనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో సాక్ష్యాల కోసం, సమాచారం కోసం సీబీఐ రు. 5 లక్షల బహుమతి ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. 2019, మార్చి 14-15 మధ్య జరిగిన వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఎవరి దగ్గరైనా నమ్మకమైన సమాచారం ఉంటే 5 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సాక్ష్యాలు కానీ లేదా నమ్మకమైన సమాచారం కానీ ఇవ్వాలని సీబీఐ ప్రకటన జారీ చేసిందంటే మరి ఇంతకాలం జరిగిన విచారణ, చేసిన దర్యాప్తులో ఎలాంటి సమాచారం సేకరించారు ? అనే డౌటు పెరిగిపోతోంది.

తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు అంటే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య రాజకీయంగా రాష్ట్రంలో అప్పట్లో తీవ్ర సంచలనమైంది. దీనిపై ముందు పోలీసులతో చంద్రబాబునాయుడు దర్యాప్తు చేయించారు. తర్వాత ప్రత్యేకంగా సిట్ విచారణను చేయించారు. అయితే ముందు పోలీసులు, తర్వాత సిట్ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడ్డాయో తెలీదు. సిట్ దర్యాప్తు మీద నమ్మకం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి, వివేకా కూతురు సునీత రెడ్డి సీబీఐ దర్యాప్తు కోరుతూ కోర్టులో పిటిషన్లు వేశారు.

తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. బాబాయ్ హత్యపై జగన్ ప్రభుత్వం మరో సిట్ విచారణకు ఆదేశించింది. అయితే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించటంతో కేసు విచారణ మొత్తం సీబీఐ పరిధిలోకి వెళ్ళిపోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో మొదట్లో దర్యాప్తు మందగించినా ఈమధ్యే స్పీడ్ పెంచింది. అనేకమందిని విచారించిన సీబీఐ కొందరిని అదుపులోకి తీసుకోవటంతో పాటు వైఎస్ కుటుంబసభ్యుల్లో కొందరిని కూడా విచారించింది. ఈనేపధ్యంలోనే హఠాత్తుగా సాక్ష్యాలు, సమాచారం కోసం రు. 5 లక్షల బహుమతి ఎందుకు ప్రకటించిందో అర్థం కావడం లేదు.


Tags:    

Similar News