తెలంగాణ ప్రాజెక్టు వద్ద వైఎస్ ఫోటోకి అభిషేకం

Update: 2016-09-29 05:01 GMT
అంతా అయిపోయాక ఎన్ని చెప్పుకుంటే మాత్రం ఏం ప్రయోజనం.. ఇట్స్ టూ లేట్ అన్నట్లుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్నేతల యవ్వారం. చేయని పనులు సైతం తమ ఖాతాల్లో వేసుకుంటున్న వేళ.. చేసిన పనుల్ని చెప్పుకోలేని చేతకానితనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని చెప్పాలి. అవతలి వారి అకౌంట్లో పేరు ప్రఖ్యాతులు డిపాజిట్ అయ్యాక.. ఆలస్యంగా నిద్ర లేచి ఎంత హడావుడి చేసినా ప్రయోజనం శూన్యం. సరిగ్గా.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉంది.

అప్పుడెప్పుడో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలు పెట్టిన ఎలంపల్లి ప్రాజెక్టును.. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పూర్తి చేయలేకపోవటం ఆ పార్టీ అసమర్థతగా చెప్పాలి. వైఎస్ పాలనలోనే టెంకాయ కొట్టి స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్టు 2014 మే నాటికి 86 శాతం పూర్తి చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతారు. మిగిలిన 14 శాతాన్ని కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చాక పూర్తి చేసి.. ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనతను తమ ఖాతాలో వేసేసుకున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేసి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే వేళలోనే నిద్ర లేచి కలిసికట్టుగా గళం విప్పినా ఒక పద్ధతిగా ఉండేదేమో. కానీ..అప్పుడా పని చేయని వారు.. ఇప్పుడు తీరిగ్గా నిద్ర లేచి.. అంతా కట్టకట్టుకొని ప్రాజెక్టు వద్దకు వచ్చి.. మొత్తం తమదేనని చెప్పుకుంటే ఎవరుమాత్రం గుర్తిస్తారు?

ప్రాజెక్టు పనులు పూర్తి అవుతున్న వేళ.. మరింత అలెర్ట్ గా ఉండి.. ఎన్నికల ముందే దాని నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తారు. కానీ.. అలాంటి లెక్కలు వేసుకొని.. పూర్తి చేసే సమర్థత కాంగ్రెస్ సర్కారుకు లేదనే చెప్పాలి. ఇలా వరుస తప్పులు చేసిన వారు.. ఇప్పుడు మాత్రం ప్రాజెక్టు నిర్మించిన ఘనత తమదేనని గొప్పలు చెప్పుకోవటంలో అర్థం లేదని చెప్పాలి. అయితే.. ఒక్క విషయంలో మాత్రం కాంగ్రెస్ ను మెచ్చుకోవాలి. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కకావికలమైనట్లు కనిపించిన కాంగ్రెస్.. ఈ మధ్యన మాత్రం ముఖ్యనేతలంతా కలిసికట్టుగా తిరగటం..ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే వీలైనంత ఎక్కువ మంది జమ కావటం సానుకూలాంశంగా చెప్పాలి.

తాజాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన కాంగ్రెస్ నేతల హాజరును చూస్తే సంతృప్తికరంగా ఉంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు దగ్గర సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వైఎస్ ఫోటోకు దండేసి.. గోదావరి జలాలతో అభిషేకం చేయటం చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్రంలో పూజలు అందుకునే సీమాంధ్ర నేత వైఎస్ ఒక్కరే అవుతారేమో అనిపించక మానదు.  ఏమైనా ఎల్లంపల్లి దగ్గర టీ కాంగ్రెస్ నేతలంతా కట్టకట్టుకొని వెళ్లి.. పూజలు చేసి.. ప్రాజెక్టు క్రెడిట్ తమదేనని చెప్పినా.. ప్రయోజనం మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఇలాంటివన్నీ మొదటినుంచీ చేస్తే బాగుండేది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News