వైఎస్ఆర్ కాపు నేస్తం.. ఆ రోజు నుంచే

Update: 2020-06-23 03:06 GMT
రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉన్నా.. క‌రోనావైర‌స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన న‌వ‌ర‌త్నాల హామీల్ని నెర‌వేర్చే విష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మ హ‌న్ రెడ్డి.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు క్యాలెండ‌ర్ కూడా విడుద‌ల చేసి మ‌రీ ఒక్కో ప‌థ‌కాన్ని ఆరంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న వైఎస్సార్ కాపు నేస్తం ప‌థ‌కం మీద దృష్టి పెట్టారు. జూన్ 24న ఈ ప‌థ‌కాన్ని ఆరంభించ‌బోతున్నారు. దానికి నిధులు కేటాయించ‌డం తో పాటు విధి విధానాల్నిప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తారు. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుండగా, వారందరికి సుమారు రూ.354 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు. ఈనెల 24న ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకం వర్తిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు. ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉండాలి.  లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.

పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు. ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు.ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఇచ్చారు. ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారుడై ఉండకూడదు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 లబ్ధిదారులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వారందరికీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి వారి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.353.81 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
Tags:    

Similar News