వైసీపీ టార్గెట్ల‌న్నీ బ‌ద్ద‌లు..ఇంట‌రెస్టింగ్ గా అబ్బ‌య్య

Update: 2019-05-24 12:36 GMT
ఈ ఎన్నిక‌ల్లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ... సంచ‌ల‌న ఫ‌లితాల‌ను న‌మోదు చేసింది. ఏ ఒక్క‌రూ ఊహించ‌ని విధంగా ఏకంగా 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో 151 సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న వైసీపీ... త‌న‌కు సాటి రాగ‌ల పార్టీ ఏదీ లేద‌ని తేల్చి చెప్పింది. అంతేకాదండోయ్‌... ఈ ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌ తీరాల‌కు చేర్చ‌డంతో పాటుగా రాష్ట్రంలోని ప‌లు కీల‌క స్థానాల్లో విజ‌యం సాధించ‌డం ద్వారా పార్టీకి గ‌ట్టి పునాదిని వేయ‌డంతో పాటుగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు జ‌గ‌న్ వేసిన పక్కా స్కెచ్ కూడా బాగానే వ‌ర్క‌వుటైంది. ఈ ప్లాన్ లో భాగంగా టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్న ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌గ‌న్ ఎంపిక చేశారు.

వాటిలో ప‌రిటాల కుటుంబం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అనంత‌పురం జిల్లా రాప్తాడు - చింత‌మ‌నేని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప‌శ్చిమ గోదావ‌రి దెందులూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటుగా త‌న పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న ఆర్కే రోజా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా న‌గ‌రి - కొడాలి నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కృష్ణా జిల్లా గుడివాడ‌ - ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి - అనిల్ కుమార్ యాద‌వ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ స్థానాల‌ను టార్గెట్లుగా ఎంచుకున్న జ‌గ‌న్‌... వాటిలో పార్టీ జెండాను ఎగుర‌వేసేందుకు ప‌క్కాగానే ప్లాన్ చేశారు. జ‌గ‌న్ ఏ త‌ర‌హా ప్లాన్ ను అమ‌లు చేశారో తెలియ‌దు గానీ... వైసీపీ టార్గెట్లుగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గాన్నింటా ఆ పార్టీ అభ్య‌ర్థులు బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించారు.

ఆర్కే రోజాను ఎలాగైనా ఓడించి తీరాల‌ని ఏకంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దిగినా... జ‌గ‌న్ ప్లాన్ ముందు బొక్క బోర్లా ప‌డ్డారు. పంటికింద న‌లుసులా మారిన కొడాలి నానిని ఎలాగైనా ఓడించాల‌ని ఆర్ధికంగా బ‌లంగా ఉన్న దేవినేని అవినాశ్ ను రంగంలోకి దించినా టీడీపీ చ‌తిక‌ల‌బ‌డింది. ఇక రాప్తాడులోనూ ఇదే వ్యూహాన్ని అమ‌లు చేసిన జ‌గ‌న్‌... తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డిని బంప‌ర్ మెజారిటీతో గెలిపించ‌డ‌మే కాకుండా ఇక‌పై ప‌రిటాల ఫ్యామిలీ త‌మ‌కు ఓ లెక్కే కాద‌ని కూడా తేల్చి చెప్పేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక మంగ‌ళ‌గిరిలో ఏకంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ పోటీకి దిగినా కూడా ఆళ్ల‌కు విక్ట‌రీ ద‌క్కేలా జ‌గ‌న్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. నెల్లూరు సిటీలోనూ మంత్రి నారాయ‌ణ‌కు ఓట‌మి చ‌విచూపించిన అనిల్ గెలుపు వెనుకా పార్టీ ప‌కడ్బందీ ప్లాన్ ఉంద‌ని చెప్ప త‌ప్ప‌దు.

ఇవ‌న్నీ ఒక ఎత్తైతే... దెందులూరులో చింత‌మ‌నేనిని ఓడించ‌డం మ‌రో ఎత్తు. ఎందుకంటే... అక్క‌డ చింత‌మ‌నేని ప్ర‌జ‌ల నేత‌, బ‌య‌ట‌కు ఎంత వివాదాస్ప‌ద నేత‌గా ఉన్నా... నియోజకవ‌ర్గ ప్ర‌జ‌ల‌కు మాత్రం ఆయ‌న అత్యంత స‌న్నిహితంగా మెలిగే నేత‌గానే ఉన్నారు. అలాంటి చింత‌మ‌నేనిని ఓడించాలంటే రోజాలాంటి నేత‌నో - కొడాలి నాని లాంటి నేతనో, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి లాంటి నేత‌నో బ‌రిలోకి దింపాలి. అయితే జ‌గ‌న్ ఇందుకు భిన్నంగా ముందుకు సాగారు. విదేశాల్లో సాఫ్గ్ వేర్ రంగంలో కీల‌క స్థానంలో ప‌నిచేస్తున్న కొఠారు అబ్బ‌య్య చౌద‌రిని దేశానికి ర‌ప్పించారు. సాఫ్ట్ వేర్ రంగంలో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న అబ్బ‌య్య‌ను ఫ్యామిలీ త‌ర‌ఫున పార్టీ త‌ర‌ఫున రాజ‌కీయం చేయాలంటూ పిలిచి మ‌రీ తీసుకొచ్చారు.

కొఠారు ఫ్యామిలీకి రాజ‌కీయాలు కొత్త కాకున్నా... అబ్బ‌య్య‌కు మాత్రం కొత్తే. అందులోనూ విదేశాల్లో సాఫ్ట్ వేర్ రంగంలో కీల‌క భూమిక పోషిస్తున్న ఓ సంస్థ‌కు సీఈఓగా వ్య‌వ‌హ‌రిస్తున్న అబ్బ‌య్య కు రాజ‌కీయాలు అస‌లు ప‌డ‌ని అంశంగానే చెప్పాలి. అయితే జ‌గ‌న్ పిలుపు అందిన వెంట‌నే సాఫ్ట్ వేర్ రంగాన్ని వ‌దిలేసి వ‌చ్చిన అబ్బ‌య్య‌... జ‌గ‌న్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ముందుకు క‌దిలి చింత‌మ‌నేనికి చుక్క‌లు చూపారు. ఏకంగా నిన్న‌టి ఫ‌లితాల్లో ఓట‌మి చవిచూపించారు. ఈ లెక్క‌న వైసీపీ ఎంచుకున్న కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో దెందులూరుకు అత్యధిక ప్రాధాన్యం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అబ్బ‌య్య‌కు మ‌రింత ప్ర‌త్యేక‌త ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టిన అబ్బ‌య్య‌కు జ‌గ‌న్ కేబినెట్ లో స్థానం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా సాఫ్ట్ వేర్ రంగంలో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న అబ్బ‌య్యకు జ‌గ‌న్ కేబినెట్ లో ఐటీ మినిస్ట్రీ ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

   

Tags:    

Similar News