కౌంటింగ్‌ లో వైసీపీ లీడ్‌..హెరిటేజ్ షేర్ల డౌన్‌ ఫాల్‌

Update: 2019-05-23 04:16 GMT
ఏపీ ఎన్నిక‌ల‌ ఫ‌లితాల‌పై ఎగ్జిట్‌ పోల్స్ ఒకింత క్లారిటీ ఇవ్వ‌గా...తాజాగా జ‌రుగుతున్న కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో తొలి రెండు గంట‌ల వ్య‌వ‌ధిలోనే...విజేత ఎవ‌రో తేలే దిశ‌గా ట్రెండ్ కొన‌సాగుతోంది. ఏపీ ఎన్నికల్లో ప్రారంభం ట్రెండ్స్‌ లో టీడీపీ వెనుకంజలో ఉండ‌టం...వైసీపీ ముందంజ‌లో ఉండ‌టం ఆయా పార్టీ శ్రేణుల‌ను మాత్ర‌మే కాకుండా వ్యాపార‌ వ‌ర్గాల‌ను సైతం ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. దీనికి నిద‌ర్శ‌నం అన్న‌ట్లుగా టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌ కంపెనీ షేర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది.

 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు  కొనసాగుతోంది. పలుచోట్ల తొలి ఫలితాల్లోనే ఫ్యాన్‌ దూసుకుపోతోంది.  లెక్కింపులో వైఎస్సార్‌ పార్టీ  అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో....టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని హెరిటేజ్ కంపెనీ షేర్‌ పై ఒత్తిడి పెరిగింది. బుధవారం రూ. 475 వద్ద ముగిసిన హెరిటేజ్‌ షేర్‌ ఇవాళ ఓపెనింగ్‌లోనే పది శాతం పైగా నష్టపోయి రూ. 411కి పడిపోయింది. తరవాత కోలుకుని ఇపుడు రూ. 453 వద్ద ట్రేడవుతోంది. ఎన్నికల ఫలితాల ప్రభావం హెరిటేజ్‌ పై బాగా ప్రభావం చూపుతోందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

ప్ర‌స్తుత ట్రెండ్ ప్ర‌కారం ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కడపలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధిక్యంలో కొనసాతుండగా... రాష్ట్రవ్యాప్తంగా 28కు పైగా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక అధికార టీడీపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉంది. లోక్‌ సభ స్థానాల్లో టీడీపీ నువ్వా నేనా అనే విధంగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండు స్థానాల్లో టీడీపీ... మరో రెండు స్థానాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 
Tags:    

Similar News