వైసీపీ నేతల అలసత్వం..కరోనాకు వరంగా మారుతోందా?

Update: 2020-04-23 07:50 GMT

ఏపీ సీఎం జగన్ కరోనా వైరస్ కట్టడి కోసం ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. ఎంత ఖర్చు అయినా ప్రజల ప్రాణాలే ముఖ్య మని ఏకంగా దక్షిణ కొరియా నుంచి కరోనా కిట్స్ తెప్పించి టెస్టులు చేస్తూ రోగులకు చికిత్సలు చేస్తూ నయం చేయిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని.. కరోనా పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజారోగ్యం కోసం ఇంతగా పాటుపడుతున్న సీఎం జగన్ కృషిని బూడిదలో పోసిన పన్నీరులా చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు - ఎంపీలు - నాయకులు.. వారి తీరుతో ఇప్పుడు కరోనా వ్యాపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

తాజాగా సాయం పంపిణీ పేరిట వైసీపీ నాయకులు జాతర నిర్వహించడం దుమారం రేపింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 30 ట్రాక్టర్ల నిత్యావసర సరుకుల లోడులతో ర్యాలీ  జనాలతో తీయడం కలకలం రేపింది. దాతల విరాళాలకు ‘జగనన్న కానుక’ పేరు పెట్టి కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. బాధ్యతగా మెలగాల్సిన నేతలు కరోనాకు వాహకాలుగా మారుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీకాకుళం ఎమ్మెల్యే ఇలానే సాయం పేరిట ఆడిన ఆటకు కరోనా వ్యాపించింది.   శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూడా భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి సరుకులు పంపిణీ చేశారు. ఆ తర్వాత పట్టణంలో భారీ స్థాయిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి.

ఇప్పుడు ఆయన బాటలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య కూడా ‘కరోనా సహాయం’ పేరిట జన జాతర చేశారు. బుధవారం సూళ్లూరుపేటలో 30 ట్రాక్టర్ల నిండా సరుకులు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి - ఎమ్మెల్యే కిలివేటి ప్రారంభించారు. ట్రాక్టర్ల డ్రైవర్లు - గ్రామ సచివాలయ సిబ్బంది భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి సరుకులను ట్రాక్టర్లలోకి ఎక్కించారు.  ఈ సహాయాన్ని నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పేదలకు అందిస్తారట. అయితే శ్రీకాళహస్తి ఘటనతో ఇప్పుడు సూళ్లూరుపేట ప్రజలు కూడా కరోనా సోకుతుందని ఆందోళనకు గురవుతున్నారు

ఇక కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి పిలుపు మేరకు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని 20 పంచాయతీల్లో సుమారు 11,500 కుటుంబాలకు వైసీపీ నాయకులు వలంటీర్ల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు - పలువురు అధికారులు ఎలాంటి భౌతిక దూరం పాటించకుండానే పాల్గొన్నారు. దీంతో ఇక్కడ కూడా కరోనా వ్యాపిస్తుందనే భయం జనాల్లో వ్యక్తమవుతోంది.

ఇక మరో తాజాగా ఘటనలో కూడా వైసీపీ నాయకుల ఓవరాక్షన్ తో కరోనా కలకలం రేగింది. అమలాపురం రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వైసీపీ నాయకుల కరోనా వ్యాప్తికి దోహదం చేశారు. ఆ బంక్ వద్ద సాయం కోసం సామగ్రిని తీసుకురాగా జనాలు గుంపులుగా ఎగబడ్డారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కనీస దూరం పాటించకుండా తోసుకున్నారు. కొట్టుకున్నారు. దీంతో కరోనా ఉంటే వ్యాపించడం ఖాయంగా మారింది.

ఇలా సీఎం జగన్ ఎంత మొత్తుకుంటున్నా.. సామాజిక దూరం పాటించమని వేడుకుంటున్నా.. వైసీపీ నేతల అత్యుత్సాహం.. సాయం పేరిట పాపులారిటీ కోసం చేస్తున్న పనులు కరోనా పెరగడానికి కారణమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ మొదట తన నాయకులను ఈ పబ్లిసిటీ పిచ్చికి దూరం చేయకపోతే కరోనా కట్టడి కాదని పలువురు హితవు పలుకుతున్నారు.
Tags:    

Similar News