మండలిలో పవర్ ఫుల్... మడమ తిప్పేస్తారా..?

Update: 2021-11-14 01:30 GMT
రాజకీయాల్లో ఆచీ తూచీ వ్యవహరించాలి అని అందుకే అంటారు. నిన్నలా నేడు ఉండదు, రేపు ఇంకోలా ఉంటుంది. అందుకే ఎవరైనా నోరు జారితే వెనక్కి తీసుకోలేరు. అయితే దూకుడునే నమ్ముకుని పాలిటిక్స్ చేసే జగన్ దాని ద్వారా చాలా సార్లు లాభపడ్డారు. అదే టైమ్ లో ఎంతో నష్టపోయారు కూడా. అయితే గత మూడేళ్ళుగా జగన్ రాజకీయ జాతకం అదిరిపోయే రేంజిలో సాగుతోంది. అన్నీ విజయాలే. అంతటా అవకాశాలే. కరవు తీరిపోయేలా క్యాడర్ కి పదవులు దక్కుతున్నాయి. ఏపీలోనే కాదు, దేశంలో కూడా ఇలాంటి ఏకపక్ష విజయావకాశాలు బహుశా ఎవరికీ ఇన్ని వచ్చి ఉండవు. దటీజ్ జగన్ అనిపించుకున్నారు కూడా.

అయితే పవర్ లోకి వచ్చిన  కొత్తల్లో జగన్ అసెంబ్లీలో 151 సీట్లు సాధించిన ఉత్సాహంతో  శాసనమండలి తనకు అడ్డుగా ఉందని భావించారు. దానికి కారణం అక్కడ భారీ మెజారిటీతో టీడీపీ ఉండడమే. దానితో పాటు జగన్ అసెంబ్లీలో పాస్ చేసిన ప్రతీ బిల్లునూ మండలిలో అడ్డుకుంటోంది. ఈ బాధ వ్యధ అధికమై చివరికి జగన్ లో ఆవేశంగా మారాయి. దానికి అగ్గి రాజేసిన మరో కారణం కూడా ఉంది. జగన్ ముచ్చట పడి మూడు రాజధానుల బిల్లుని తెస్తే మండలిలో టీడీపీ  అడ్డంగా కొట్టేసి సెలెక్ట్ కమిటీకి సిఫార్స్ చేసింది. దానికంటే ముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులకు కూడా అక్కడ బ్రేక్ పడిపోయింది. దీంతో మండిన జగన్ మండలికే ఏకంగా మంగళం పాడేద్దామని నిర్ణయించారు. అంతే 2020 జనవరిలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మరీ మండలి వద్దు రద్దు అనేశారు.

దాని మీద అసెంబ్లీలో మూడు వంతుల భారీ మెజారిటీ వైసీపీకి ఉన్నందువల్ల సులువుగా రాజ్యాంగబద్ధంగా తీర్మానం పాస్ అయిపోయింది. అదిపుడు కేంద్రం వద్ద పెండింగులో ఉంది. నాడు జగన్ సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మండలి ఇపుడు తమకు అవసరం లేదని చెప్పేశారు. మరో ఏడాదిలో తమకు అక్కడ మెజారిటీ వస్తుందని తెలిసినా ప్రజా శ్రేయస్సు దృష్ట్యానే మండలి వద్దు అనుకుంటున్నామని కూడా చెప్పుకున్నారు. మండలి వల్ల అనవసరంగా ప్రజా ధనం దండుగ తప్ప వేరే ఉపయోగాలు లేవు అని కూడా అన్నారు. ఇక ప్రజల ఆమోదంతో గెలిచిన ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బిల్లులను మండలిలో అన్యాయంగా అడ్డుకుంటున్నారని, అక్కడ రాజకీయం తప్ప విలువైన సూచనలు రావడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నాడు పేర్కొన్నారు.

దాని మీద కేంద్రానికి తీర్మానం పంపించారు. అప్పట్లో జగన్ తరచూ ఢిల్లీ వెళ్ళినపుడు మండలి రద్దు కోసం కోరుతూ వచ్చారు. అయితే కేంద్రం మాత్రం దాని మీద దృష్టి పెట్టలేదు. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నా దానికి మించి కరోనా కూడా అడ్డు పడిపోయింది. దాంతో  అనేక కీలకమైన బిల్లులే పెండింగులో పడ్డాయి.  ఏపీలో మండలి పై వేటు వేయడం అంత అర్జంటు కాదు అని కేంద్ర పెద్దలు భావించి ఉండవచ్చు. ఇపుడు చూస్తే ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. మండలిలో తాజాగా ఖాళీ అయిన 14 సీట్లను భర్తీ చేస్తే అవన్నీ వైసీపీకే దక్కుతాయి. దీని మీద నోటిఫికెషన్ కూడా వచ్చింది. కాబట్టి మరి కొద్ది రోజుల్లో మండలిలో 32 మందికి వైసీపీ బలం చేరుకుంటుంది. అంటే పవర్ ఫుల్ పొజిషన్ అన్న మాట. అదే టైమ్ లో ఇన్నాళ్ళూ మండలి మంద బలాన్ని చూపించి చికాకు పెట్టిన టీడీపీ బలం 14కి చేరబోతోంది.

ఇక ఉభయ సభల్లో వైసీపీది ఆడింది ఆట పాడింది పాటలాగా రాజకీయ సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది అన్న మాట. ఇంత చక్కని తరుణంలో కూడా వైసీపీని ఒక భయం భీతి వెంటాడుతున్నాయి. అవేంటి అంటే కేంద్రం వద్ద పెండింగులో ఉన్న‌ మండలి రద్దు తీర్మానానికి కనుక కదలిక వస్తే అపుడు మన పరిస్థితి ఏంటి అని. నిజానికి ఇప్పుడు పంతాలకు పట్టింపులకు పోకుండా వైసీపీ తన తీర్మానం వెనక్కు తీసుకోవచ్చు. దాని మీద కేంద్రం కూడా అభ్యంతరం పెట్టేది ఉండదు. కానీ ఒకసారి మండలి తీర్మానం మీద కేంద్రం కసరత్తు కనుక మొదలెడితే మాత్రం ఏపీ సర్కార్ చేయి దాటిపోయినట్లే. కేంద్ర న్యాయ శాఖ దాన్ని పరిశీలించి క్యాబినేట్లో చర్చకు పెట్టి ఉభయ సభల్లో  బిల్లుగా ప్రవేశపెడితే ఆమోదం పొందడం ఖాయం. ఆ మీదట రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ తో ఏపీ మండలి రద్దు అయిపోతుంది.

అంటే కేంద్రం కనుక తలచుకుంటే చకచకా ఈ పరిణామాలు జరిగిపోతాయి. మరి ఇపుడు మాత్రం వైసీపీకి రద్దుని అడ్డుకునే వీలుంది. అయితే జగన్ మాట తప్పను మడప తిప్పను అని అంటారు. ఆయన రద్దు వద్దు అంటే మాట పోతుంది, మడమ తిప్పేసినట్లు అవుతుంది. అయితే ఆ ఒక్క మాట విలువ ఇపుడు ఏంటి అంటే ఎంతో మంది వైసీపీ నేతల రాజకీయ  భవిష్యత్తు. జగన్ చాలా మంది నాయకులకు టికెట్లు ఇవ్వలేకపోతే మండలి దారి చూపించి అధికార హోదా స్థిరం చేస్తున్నారు. అదే విధంగా తన రాజకీయ పట్టుని పెంచుకుంటున్నారు. ఒక విధంగా మండలి ఇపుడు వైసీపీకి చాలా అవసరం. ఎంతో మంది ఆశావహులకు అది పునరావాసం. అలాంటి దాన్ని ఒక్క  మాటకు పోయి రద్దు చేసుకునే దాకా తెచ్చుకుంటే తప్పు జగన్ దే అవుతుంది. అయితే తీర్మానం ఒకసారి పంపి వెనక్కి తీసుకుంటే  జగన్ ఇమేజ్ మాత్రం డ్యామేజ్ అవుతుంది. మొత్తానికి జగన్ దూకుడుగా చేసిన రద్దు తీర్మానమే ఇపుడు వైసీపీ రాజకీయాన్ని బలి కోరుతుందా అన్న చర్చ అయితే పార్టీలో గట్టిగా ఉంది. మరి దీని మీద జగన్ ఏం చేస్తారు అన్నది చూడాలి. ఇక కేంద్రానికే ఈ విషయాన్ని విడిచిపెడితే మాత్రం తమ రాజకీయాల కోసం అక్కడి పెద్దలు ఏ టైమ్ లో అయినా మండలిని  రద్దు చేసి పారేయడం ఖాయం.
Tags:    

Similar News