ఎమ్మెల్యే పాద‌యాత్ర‌:జ‌గ‌న్ సీఎం కావ‌డ‌మే ల‌క్ష్యం

Update: 2017-10-22 05:46 GMT
జ‌నం కోసం జ‌గ‌న్.. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌లు చెబుతూ వ‌చ్చిన మాట‌. అయితే, ``జ‌గ‌న్ కోసం ఎమ్మెల్యే`` అంటున్నారు గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి! ఆశ్చ‌ర్యం అనిపించినా ఇది నిజం!! వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే 2019 లేదా అంత‌క‌న్నా ముందే ఎన్నిక‌లు జ‌రిగినా జ‌గ‌న్‌ ను సీఎంను చేయాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న ఇప్ప‌టి వ‌రకు ఎవ‌రూ చేయ‌ని సాహ‌సం చేస్తున్నారు. గుంటూరు నుంచి తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేసి, జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతూ.. తిరుమ‌ల శ్రీవారికి పూజ‌లు చేయించాల‌ని ఆయ‌న మొక్కుకున్నారు. దీంతో ఆయ‌న శ‌నివారం పెద్ద ఎత్తున స్థానికంగా పూజ‌లు చేసి.. త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.

నిజానికి ఇప్ప‌టికే జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుతూ.. వైసీపీ నేత‌ భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిరంత‌ర చండీయాగం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా జ‌గ‌న్ కోసం పాద‌యాత్ర చేయ‌డం పార్టీలో జ‌గ‌న్ సీఎం కోరుకునే వారి అభిలాష‌ను స్ప‌ష్టం చేస్తోంది. శ‌నివారం ప్రారంభ‌మైన గోపిరెడ్డి పాద‌యాత్ర‌ను వైసీపీ సీనియర్‌ నేత - ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ... 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. అలాగే  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవ‌డం తధ్యమని భ‌రోసా వ్య‌క్తం చేశారు.

ఈ యాత్రలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు 150 మంది పాల్గొంటారు. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల్లో తిరుమలకు చేరుకుంటారు. పాదయాత్రలో కులాలు - మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ - ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - ఆళ్ల రామకృష్ణారెడ్డి - కోన రఘుపతి - మహ్మద్‌ ముస్తాఫా - పార్టీ నేతలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి - మర్రి రాజశేఖర్ - అంబటి రాంబాబుతో పాటు ఇతర జిల్లా నాయకులు  భారీ సంఖ్య‌లో హాజరయ్యారు.  మొత్తానికి జ‌నం కోసం జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించబోతున్న త‌రుణంలో ఆయ‌న కోసం నేత‌లు పాద‌యాత్ర గా వెళ్లి.. శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని అంటున్నారు వైసీపీ అభిమానులు.
Tags:    

Similar News