చెప్పాలని ఉంది.. గుండె విప్పాల‌ని ఉంది.. జ‌గ‌న్ ఛాన్స్ ఇచ్చేనా?

Update: 2022-03-28 02:44 GMT
చెప్పాల‌ని ఉంది. గుండె విప్పాల‌ని ఉండి.. అంటూ.. ఓ సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే.. తాడేప‌ల్లి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే.. జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో త‌న‌కు చోటు క‌ల్పించాల‌న్న‌ది ఆయ‌న భావ‌న‌. త‌న సీనియార్టీతో పోలిస్తే.. త‌న సొంత జిల్లాల్లో ఎవ‌రూ లేర‌ని కూడాఆయ‌న చెబుతున్నా రు. ఈ క్ర‌మంలోనే మంత్రి వ‌ర్గంలో ఇప్ప‌టికైనా.. అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు.కానీ, గ‌త నాలుగు రోజులుగా విజ‌య‌వాడ‌లోనే మ‌కాం వేసి.. తాడేప‌ల్లి చుట్టూ ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నా.. సీఎం అప్పాయింట్‌మెంట్ మాత్రం ల‌భించ‌లేద‌ట‌.

ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రంటే.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సొంతం చేసుకున్న‌.. క‌ర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్ రెడ్డి.  40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయ‌న వివాద ర‌హిత నాయ‌కుడిగా పేరు తెచ్చ‌కున్నారు. కర్నూలు జిల్లాలో సీనియర్ నాయకుడే కాదు.. సిన్సియారిటీ ఉన్న నేతగా పేరుంది. కానీ ఆయన  ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఒక్కసారి కూడా మంత్రి కాలేక పోయారు. ఇదే ఇప్పుడు ఆయ‌న‌ను వేధిస్తోంది. వ‌య‌సు రీత్యా ఇప్పుడు క‌నుక ద‌క్క‌క‌పోతే.. ఇక‌, జీవితంలో ఎప్ప‌టికీ.. ద‌క్క‌ద‌నే భావ‌న‌లో ఉన్నారు.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాట‌సాని.. క‌ర్నూలు జిల్లాలోని కీల‌క‌మైన‌ నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్‌లో బలమైన నేతగా ఉన్నారు. అయితే కాటసాని వర్గానికి ఇప్పటికీ వెంటాడుతున్న నిరాశ ఒక్కటే.. తమ అభిమాన నేతకు మంత్రి పదవి దక్కడం లేదన్నది. నిజానికి వైఎస్ హ‌యాంలోనే ఉమ్మ‌డి రాష్ట్రంలో కాట‌సానికి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు.

రాష్ట్ర విభజన అనంతరం.. రాజకీయ సమీకరణల నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పిన కాటసాని.. పాణ్యం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. ఆయన గట్టి పోటీ ఇచ్చారు. 60,598 ఓట్లు సాధించి.. అప్పటి వైసీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి చేతిలో 11,647 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరినా.. 2019 ఎన్నికలకు ముందు జ‌గ‌న్ చెంత‌కు చేరారు. వైసీపీ నుంచి  పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి.. విజయం సాధించారు.

ఈ క్ర‌మంలోనే జగన్ ఆయ‌న‌కు మంత్రి ప‌దవి ఇస్తార‌ని అంద‌రూ ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఆయ‌న‌కు రాలేదు. దీనికి కార‌ణం.. రెడ్డి ట్యాగేన‌ని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఎందుకంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఇప్ప‌టికే క‌ర్నూలు నుంచి అత్యంత కీల‌క‌మైన నాయ‌కులు ఉన్నారు. అదేస‌మ‌యం లో మైనార్టీ నాయ‌కుల‌కుకూడా ఈ జిల్లా నుంచి ప్రాధాన్యం ఇవ్వాల్సి  ఉంది.

ఈ నేప‌థ్యంలోనే.. కాట‌సానికి ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని చెబుతున్నారు. అయితే.. త్వరలో  కేబినెట్ విస్తరణ జ‌రుగుతుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో కాటసాని తాడేప‌ల్లి వ‌ర్గాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, సీఎం అప్పాయింట్‌మెంట్ మాత్రం ల‌భించ‌లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News