అధికారుల భుజం మీద తుపాకీ.. కోటం రెడ్డి అటాక్ అక్కడే...?

Update: 2023-01-30 05:00 GMT
ఆయన వైసీపీకి నిబద్ధత కలిగిన నాయకుడు. ఒక విధంగా చెప్పాలీ అంటే వైసీపీకి ఆయన నిజమైన కార్యకర్త లాంటి వారు. ఆయన వైసీపీ కోసం ఎంతో పనిచేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని వేయి మొక్కులు కోటి పూజలు చేసిన వారు. అలాంటి కోటం రెడ్డి ఫుల్ రివర్స్ అవుతున్నారు. ఇది కదా వైసీపీకి అసలైన గుండె దడ కలిగించే సర్వే.

ఇది కదా ఏ పీకే ఇవ్వని సర్వే. వైసీపీ వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 సీట్లు అంటోంది. పార్టీకి మూల స్థంభాల్లాంటి నాయకులు మాత్రం ఎదురు తిరుగుతున్నారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఏదో సంచలనమే రేకెత్తించేలా ఉన్నారు అని అంటున్నారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత. పదేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు కానీ ఇపుడు చూస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ డౌట్ లో పడిందా అన్న చర్చ వస్తోంది. జగన్ నైజం తెలిసిన వారు ఎవరైనా ఇలా ఎదురు తిరిగి మాట్లాడితే టికెట్ కట్ అని చెబుతారు అనే అంటున్నారు. ఇక కోటం రెడ్డి తాజాగా పేల్చిన బాంబు ఏంటి అంటే తన ఫోన్లను ఎవరో నిఘా పెట్టి మరీ ట్యాపింగ్ చేస్తున్నారు అని.

దానికి గానూ ఆయన ఇంటలిజెన్స్ అధికారుల మీద విరుచుకుపడుతున్నారు. ఆయన వారిని గట్టిగానే తగులుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తన ఫోన్ల మీదనే నిఘా పెడతారా  మీకెక్కడి ధైర్యం అని అంటున్నారు. తాను వాట్సప్ కాల్స్ లో మాట్లాడితే ఏమి చేస్తారని, అలాగే టెలిగ్రాం కాల్స్ తో మాట్లాడితే ఎవరు నిఘా పెట్టగలరు అని కూడా నిలదీస్తున్నారు

తాను ఇవాళా నిన్నా పాలిటిక్స్ లో లేనని మూడున్నర దశాబ్దాలుగా ఉన్నాను అని ఆయన అంటున్నారు. తాను ఎపుడేమి చేయలో చేస్తాను తనకు అన్నీ తెలుసు అని చెబుతున్నారు. ఇక కోటం రెడ్డి విషయం చూస్తే వైసీపీకి తలనొప్పిగానే ఉంది అని అంటున్నారు. ఆయన గతంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి రావత్ మీద విమర్శలు చేశారు. దాంతో జగన్ తనను కలవాలని కోరారు.

అలా వచ్చిన కోటం రెడ్డికి జగన్ ఏమి చెప్పారో కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు. కానీ ఆ తరువాత మళ్ళీ తనదైన శైలిలో స్పీడ్ పెంచారు. తనను నెల్లూరు జిల్లాలో కొన్ని పెద్ద తలకాయలు అడ్డుకుంటున్నాయని ఆయన విమర్శించారు. తనను అణగదొక్కాలని చూస్తున్నాయ్ని కూడా ఆయన ఆరోపించి సంచలనం రేకెత్తించారు. తాను వారికి తలొగ్గేదే లేదని అన్నారు.

తాను ఆ తలకాయలను పక్కన పెట్టి మరీ ముందుకు సాగుతాను అని చెప్పారు. ఇపుడు ఆయన మళ్లీ సౌండ్ చేశారు. తన మీద నిఘా అంటున్నారు అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం అని ప్రశ్నిస్తున్నారు. కోటం రెడ్డి వ్యవహారం చూస్తే అధికారుల మీద విమర్శలు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నా ఆయన అసలు ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే అంటున్నారు. మరి ఈసారి జగన్ ఉపేక్షిస్తారా. లేక మరోసారి క్లాస్ తీసుకుంటారా. లేక కోమటి రెడ్డిని సైడ్ చేయగలరా అన్నది చూడాలని అంటున్నారు.

Similar News