టీడీపీ రామయ్యకు వైసీపీ పధకం

Update: 2022-10-28 10:45 GMT
ఆయన తెలుగుదేశం  సీనియర్ నేత. ఆ  పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్. ఆయన పెద్ద గొంతుతో టీడీపీ తరఫున నిత్యం మీడియా ముందు వాదించే సమర్ధుడు. ఆయన వైసీపీ సర్కార్ మీద ఘాటైన విమర్శలు ఎపుడూ చేస్తూంటారు. వైసీపీ సర్కార్ ఏమీ చేయలేదని కూడా ఆయన ఆరోపిస్తారు. ఆయనే వర్ల రామయ్య. అలాంటి టీడీపీ వర్ల రామయ్యకు వైసీపీ ప్రభుత్వ పధకం ఒకటి  అందింది.

ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో తాము కులం, ప్రాంతం వర్గం వర్ణం,  రాజకీయ పార్టీలను అసలు చూడమని ఇప్పటికి అనేకసార్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.

దానికి ఉదాహరణగా టీడీపీలో సీనియర్ నేత కీలకమైన వర్ల రామయ్యకు ప్రభుత్వ పధకం అందడం విశేషం. రైతు భరోసా పధకం కింద 13,500 రూపాయలను వర్ల రామయ్య సతీమణి జయప్రదకు లబ్ది కలిగించామని చెబుతూ ధృవీకరణ పత్రాన్ని అందించేందుకు వైసీపీ మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ఇంటికి వెళ్లారు.

అయితే ఆ సమయంలో వర్ల రామయ్య ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు రాలేదని భోగట్టా. దాంతో ఆ పధకానికి సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని ఆయన కారు డ్రైవర్ కి వెల్లంపల్లి ఇచ్చేసి వచ్చారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అర్హత ఉంటే చంద్రబాబు మనవడు దేవాన్ష్ కి కూడా అమ్మ ఒడి పధకం ఇస్తామని, అయితే తెల్ల రేషన్ కార్డు ఉండాలని అన్నారు.

ఆ విషయం ఎలా ఉన్నా తెలుగుదేశం కీలక నేతలకు కూడా తమ పధకాలు సక్రమంగా అందుతున్నాయని  వైసీపీ సర్కార్  చెప్పుకోవడానికి ఒక ఆయుధం అందినట్లు అయింది. ఏది ఏమైనా రాజకీయాలు వేరు. అందరూ మొదట ప్రజల కిందనే వస్తారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నారా రాజకీయ రంగు రుచి చూడకుండా అర్హత ఉండే పధకాలు అందించాల్సిందే.

అయితే దీన్ని రాజకీయ కోణం నుంచి చూస్తూ గతంలో కొన్ని పార్టీలు అమలు చేయకపోవడం వల్లనే ఇపుడు వైసీపీకి ఈ విధంగా చెప్పుకునే చాన్స్ వచ్చింది అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News