ఆ దేశంలో క్వారంటైన్‌ కల్లోలం.. చిన్నారులు బలి!

Update: 2022-11-18 03:53 GMT
కరోనా మహమ్మారి పుట్టిన చైనాను ఆ మహమ్మారి ఇంకా పీడిస్తూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా తన రూపాన్ని మార్చుకుని దశలవారీగా చైనాపైకి దండయాత్ర చేస్తూనే ఉంది. దీంతో చైనీయులు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నారు. మరోవైపు జీరో వైరస్‌ కట్టడి పేరుతో చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ఇంకా ఇబ్బందులు పెడుతున్నాయని తెలుస్తోంది.  

కరోనా కట్టడికి చైనా అవలంబిస్తున్న జీరో కోవిడ్‌ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కోవిడ్‌ ఆంక్షలతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్‌ సోకినవారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ వారిని బయటకు వెళ్లనీయడం లేదని తెలుస్తోంది. దీంతో క్వారంటైన్‌లో ఉన్న ఓ చిన్నారికి సకాలంలో వైద్యం అందక కన్నుమూసిన ఘటన అందరిలో ఆగ్రహానికి కారణమైంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. ఓ కుటుంబం ఝేంగ్‌జువా నగరానికి దూరంగా ఉన్న హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంది. ఈ క్రమంలోనే వారి నాలుగు నెలల పాపకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసర వైద్యం కోసం ప్రయత్నించారు. అయితే కోవిడ్‌ ఆంక్షల కారణంగా అధికారులు బయటకు పంపలేదు. దీంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించింది.

క్వారంటైన్‌లో చిన్నారి మృతి చెందడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే ఓ మూడేళ్ల చిన్నారి ఇలాగే మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా నాలుగు నెలల పాప చనిపోవడంపై అక్కడి ప్రభుత్వంపై చైనీయులు నిప్పులు చెరుగుతున్నారు.

కాగా ఏప్రిల్‌ 29 తర్వాత అత్యధిక సంఖ్యలో కోవిడ్‌ కేసులు చైనాలో వెలుగుచూస్తున్నాయి. నిత్యం పది వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనాలోని ఝేంగ్‌జువా నగరంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. దీంతో అక్కడ లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి.

లాక్‌డౌన్‌తో ఝేంగ్‌జువాలో లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా లక్షణాలున్నవారిని నగరానికి దూరంగా ఉన్న క్వారంటైన్‌ కేంద్రాల్లో పెడుతున్నారు.

లాంఝువా నగరంలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. క్వారంటైన్‌లో ఉన్న మూడేళ్ల చిన్నారి అస్వస్థత పాలైంది. దీంతో ఆసుపత్రికి వెళ్లేందుకు చిన్నారి తండ్రి ప్రయత్నించినప్పటికీ అధికారులు అడ్డుకున్నారు. పరిస్థితి విషమించి ఆ బాలుడు చనిపోయాడు. దీనికి కారణం ఆరోగ్య కార్యకర్తలేనని బాలుడి తండ్రి మండిపడ్డాడు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

అధికారుల ప్రవర్తనను నిరసిస్తూ బారికేడ్లను దాటడంతోపాటు సోషల్‌ మీడియాలోనూ పెద్ద ఎత్తున అధికారుల చర్యలను ఖండించారు. దీనిపై స్పందించిన అధికారులు ఇటువంటివి జరగకుండా చూస్తామని అప్పట్లో చెప్పారు. అయినా ఫలితం శూన్యం. మళ్లీ ఇంతలోనే ఝేంగ్‌జువాలో చిన్నారి వైద్యం అందక మృతి చెందింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News