రోజుకు 25వేల ఇళ్లు తిరగటం సాధ్యమేనా?

Update: 2015-11-05 06:45 GMT
గ్రేటర్ పరిధిలోని ఓటర్ల తొలగింపు వ్యవహారం మరో మలుపు తిరిగింది. దాదాపు 6.3 లక్షల ఓట్లు తొలగింపు వ్యవహారం వివాదాస్పదమై.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ కు పంపి.. వివిధ కోణాల్లో విచారణ జరిపించింది. ఓట్ల తొలగింపుపై వచ్చిన ఆరోపణలు ఉన్న కాలనీల్లో ఎన్నికల సంఘం అధికారులు విచారణ జరిపి ఆరోపణలు నిజమే అని తేల్చారు. దీంతో ఈ నెల 18 నాటికి ఓట్లు తొలగించిన ఓటర్లు సదరు చిరునామాల్లో ఉన్నారా? లేదా? అన్న విషయంపై మరోసారి తనిఖీ నిర్వహించాలని ఈసీ ప్రభుత్వానికి చెప్పింది. దీంతో.. అధికారులు తాము తొలగించిన 6.3 లక్షల ఓటర్ల ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం ఇపుడు ఏర్పడింది.

మరి.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు పని చేసే ఛాన్స్ ఉందా? అంటే సందేహమే. ఎందుకంటే.. ఈ రోజు నుంచి మొదలయ్యే తనిఖీ కార్యక్రమానికి గడువుకు మధ్య ఉన్నది 14 రోజులు మాత్రమే. ఈ స్వల్ప వ్యవధిలో 6.3 లక్షల ఓట్లర్లను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇంటికి కనీసంగా రెండు ఓట్లు లెక్క వేసుకున్నా.. 3.25 లక్షల ఇళ్లను అధికారులు సందర్శించాల్సి ఉంటుంది. అది కూడా రెండు వారాల స్వల్ప వ్యవధిలో. ఇంకో ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే.. వారాంతపు సెలవులతో పాటు.. మధ్యలో వచ్చే దీపావళి పర్వదినాన్ని లెక్కేస్తే మరిన్ని రోజులు తగ్గిపోతాయి.

అంతే.. కాస్త అటూ ఇటూగా రోజుకు 25 వేల ఇళ్లను అధికారులు సందర్శించి.. తాము తొలగించిన ఓటర్లు సదరు అడ్రస్ లలో ఉన్నారా? లేరా? అన్నది తనిఖీ చేయాల్సి ఉంటుంది. మరి.. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ఇచ్చిన స్వల్పమైన వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారన్నది ప్రశ్న. ఒకవేళ.. ఎన్నికల సంఘం ఆదేశాల్ని తూచా తప్పకుండా అధికారులు ‘‘పని’’ చేసిన పక్షంలో.. దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకవేళ.. అధికారులు సరిగా పని చేస్తే.. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలే ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఈ నేపథ్యంలో.. తనిఖీ కార్యక్రమం కూడా వివాదాస్పదంగా మారే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News