ఆటకూ ధరకూ సంబంధం ఉందా... ఏబీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024కు సంబంధించి జరిగిన మినీ వేలంలో రికార్డ్ ధరలు పలికిన సంగతి తెలిసిందే.

Update: 2023-12-23 17:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024కు సంబంధించి జరిగిన మినీ వేలంలో రికార్డ్ ధరలు పలికిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంపై పలు రకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే టీం ఇండియా వెటరన్ దినేష్ కార్తీక్ ఈ విషయంపై తనదైన విశ్లేషణ చేశారు. వేలంలో ఉన్న లొసుగులను విదేశీ ఆటగాళ్లూ వ్యూహాత్మకంగా వినియోగించు కుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో తాజాగా ఇదే విషయంపై దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

అవును... తాజాగా జరిగిన ఐపీఎల్ మినీవేలంలో నమోదైన రికార్డ్ ధరలపై ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ (రూ.24.75 కోట్లు), ఆసిస్ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ (రూ.20.5)కు అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకోవడంపై కారణాలు అర్ధకావడం లేదని తెలిపాడు. ఇదే సమయంలో ప్రధానంగా... 2023 ఐపీఎల్‌ వేలానికి సంబంధించి పంజాబ్‌ కింగ్స్‌ జట్టు రూ.18.50 కోట్ల వెచ్చించి సాం కరన్ ను సొంతం చేసుకున్న విషయంపైనా స్పందించాడు.

ఈ సందర్భంగా అత్యధిక మొత్తంలో తీసుకుంటూ అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్న సాం కరన్ గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా... సాం కరన్ ప్రస్తావనతో తాను వివాదంలోకి దిగాలనుకోవడం లేదు కానీ అని మొదలుపెట్టిన ఏబీ... గత కొన్నేళ్లుగా అతడి ప్రదర్శనకు తీసుకుంటున్న మొత్తానికీ సంబంధం లేదని అనిపిస్తోందని అన్నాడు. అలాగని అతడు మరీ తక్కువ స్థాయి ఆటగాడు కాదని తెలిపాడు.

ఈ సందర్భంగా సాం ఆటను ఇష్టపడతాను కానీ అని చెప్పిన ఏబీ... ప్రపంచకప్‌ లో అతడు బాగా ఆడాడని.. అయితే అది కొన్నేళ్ల క్రితమని తెలిపాడు. ఇదే సమయంలో ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌ మ్యాచులతోపాటు ఇంగ్లాండ్‌ టీం తరఫున అతడు అద్భుతంగా ఆడాడని అనుకోవడం లేదుని అన్నాడు. అనంతరం ఫైనల్ కన్ క్లూజన్ గా... తనదైన రోజున ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్ల మాదిరి ప్రదర్శన చేయగలడని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు

కాగా... మొత్తం 46 ఐపీఎల్‌ మ్యాచ్‌ లు ఆడిన సాం కరన్ 36 ఇన్నింగ్స్‌ ల్లో 613 పరుగులు చేశాడు. వీటిలో మూడు ఆఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక పరుగులు 55 నాటౌట్. ఇక బౌలింగ్‌ లో విషయానికొస్తే 46 మ్యాచ్ లలోనూ 45 వికెట్లు తీశాడు. ఇక బౌలింగ్ లో బెస్ట్ 11 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం!

Tags:    

Similar News