ఆల్ రౌండర్ లోటు.. ఫైనల్లో బాగా దెబ్బ కొట్టిందే..
2019 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియాలో ప్రధాన లోపం నాలుగో నంబరు బ్యాట్స్ మన్ గా స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా లేకపోవడం.
2019 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియాలో ప్రధాన లోపం నాలుగో నంబరు బ్యాట్స్ మన్ గా స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా లేకపోవడం. అందులోనూ విజయ్ శంకర్ వంటి సాధారణ ఆల్ రౌండర్ ను నాలుగో నంబరుకు పరిగణించి అప్పటి సెలక్షన్ కమిటీ దారుణమైన పొరపాటు చేసింది. హైదరాబాదీ బ్యాట్స్ మన్ అంబటి రాయుడును విస్మరించారు సరే.. అజింక్య రహానే వంటి పూర్తిస్థాయి మిడిలార్డర్ బ్యాటర్ ను అయినా తీసుకోలేదు. అయితే, అప్పట్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వారు ఉండడంతో ఫర్వాలేదనిపించింది. ఆదివారం నాటి ఫైనల్లో మాత్రం పెద్ద లోటు కనిపించింది.
చిన్న గాయం.. ఎంత చేటు..?
హార్డిక్ పేస్ ఆల్ రౌండర్. తన ఆటతీరుతో జట్టుకు విలువ తెస్తాడు. ఆట కంటే.. మైదానంలో అతడు చూపించే తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆరో నంబరులో అతడు నమ్మదగ్గ బ్యాట్స్ మన్. దూకుడుతో మంచి స్కోర్లు చేయగలడు. తన పేస్ బౌలింగ్ లో పూర్తి కోటా వేయగలడు. ప్రపంచ కప్ లో తొలి మూడు మ్యాచ్ లకు అతడు అందుబాటులో ఉన్నాడు. ఫర్వాలేదనేలా ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ అవకాశం రాకున్నా.. బౌలర్ గా రాణించాడు. అయితే, బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కాలి మడమ గాయానికి గురై టోర్నీకే దూరమయ్యాడు. అయితే, హార్దిక్ కు గాయమైన సమయానికే టీమిండియా ఊపులోకి వచ్చేయడంతో పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ, మరో పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను నమ్మలేని పరిస్థితుల్లో బెంచ్ పై ఉన్న పేసర్ మొహమ్మద్ షమిని ఆడించారు. షమి ఎలా చెలరేగాడో అందరూ చూశారు. అయితే, హార్దిక్ తరహా బ్యాటర్ లేని దెబ్బ మాత్రం పడింది.
ఫైనల్లో బ్యాటింగ్ లో అదే దెబ్బ..
ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా త్వరత్వరగా వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో ఆరో నంబరులో హార్దిక్ అవసరం గుర్తొచ్చింది. వాస్తవానికి ఈ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను తీసుకున్నారు. కానీ, అతడిదంతా టి20 స్టయిల్. దీంతో పూర్తిగా నమ్మలేని పరిస్థితి. అందుకే.. కోహ్లి ఔటయ్యాక సూర్య బదులు జడేజాను పంపారు. ఇక్కడే తేడా తెలిసితోంది.. హార్దిక్ ఉంటే.. జడేజా కంటే ముందే వచ్చేవాడు. కీలక ఇన్నింగ్స్ ఆడేవాడేమో..?
బంతిని అందుకునే వాడు..
హార్దిక్ పాండ్యా 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగలడు. నాలుగో పేసర్ గా బంతిని అందుకునేవాడు. కచ్చితంగా సిరాజ్/షమీలలో ఒకరికి తోడుగా ప్రభావం చూపేవాడు. వాస్తవానికి ఆదివారం నాటి ఫైనల్లో సిరాజ్ తేలిపోయాడు. లీగ్, సెమీస్ లో అతడు పరుగులు ఇస్తుడడంతో ఫైనల్లో కొత్త బంతిని ఇవ్వలేదు. బుమ్రా తర్వాత షమీతో బౌలింగ్ చేయించారు. మూడో పేసర్ గానూ సిరాజ్ ఆకట్టుకోలేదు. పిచ్ బ్యాటింగ్ కు తేలిగ్గా మారాక.. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ ప్రభావం చూపలేకపోయారు. అదే నాలుగో పేసర్ గా హార్దిక్ ఉంటే బౌలింగ్ లో వైవిధ్యంతో ఆదుకునేవాడే అనే అభిప్రాయం కలుగుతోంది.
నిఖార్సయిన ఆల్ రౌండర్
ఓవిధంగా చెప్పాలంటే రవీంద్ర జడేజా కంటే.. హార్దిక్ నిఖార్సయిన ఆల్ రౌండర్. బ్యాట్ తో బంతితో సమానంగా ప్రభావం చూపగలడు. కానీ, భారత్ బ్యాడ్ లక్ ఏమంటే, ఎవరు బాగా అవసరమో అతడే గాయపడ్డాడు. ముఖ్యంగా బ్యాట్ తో ఆదుకోవాల్సిన సమయంలో హార్దిక్ లేని లోటు కనిపించింది. టీమిండియా ప్రపంచ కప్ కల చెదరడంలో అదో కీలక పాత్ర పోషించింది.