కుర్రాళ్లూ.. దంచేసుకోండి.. ఇదే చివరి ఛాన్స్

Update: 2015-07-14 06:39 GMT
మురళీ విజయ్‌కు వన్డే జట్టులో చోటు దక్కి రెండేళ్లకు పైనే అయింది. రాబిన్ ఉతప్ప, మనోజ్ తివారిలకు కూడా అవకాశాలు అరుదుగా దక్కుతున్నాయి. కేదార్ జాదవ్ ఎప్పుడో ఒకసారి వన్డే ఆడాడు. మనీష్ పాండే అయితే ఇప్పటిదాకా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిందే లేదు. ఐతే జింబాబ్వే పర్యటనకు సీనియర్ క్రికెటర్లు చాలామంది విశ్రాంతి కోరుకోవడంతో వీళ్లందరికీ లేక లేక భారత వన్డే జట్టులో చోటు దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేలు అయిపోయాయి. మురళీ విజయ్ మాత్రమే రెండో వన్డేలో సత్తా చాటాడు. ఉతప్ప, తివారి, జాదవ్‌‌లు రెండు మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమయ్యారు. మనీష్ పాండేకు తుది జట్టులో అవకాశమే దక్కలేదు.

ఐతే మంగళవారం సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే జరగబోతోంది. ఇప్పటికే సిరీస్ 2-0లో సొంతమైన నేపథ్యంలో భారత్‌పై ఎలాంటి ఒత్తిడీ లేదు. లేక లేక వన్డే జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు సత్తా చాటుకోవడానిది చివరి అవకాశం. తొలి వన్డేల్లో అదరగొట్టిన మన అంబటి రాయుడు గాయం కారణంగా అనూహ్యంగా ఈ మ్యాచ్‌కు ముందు జట్టుకు దూరమయ్యాడు. అతను మొత్తంగా పర్యటన నుంచే తప్పుకున్నాడు. దీంతో మనీష్ పాండేకు తొలి వన్డే ఆడే అవకాశం లభిస్తోంది. తొలి రెండు వన్డేల్లో అవకాశం దక్కని యువ పేసర్ సందీప్ సింగ్‌ను కూడా ఈ మ్యాచ్‌లో ఆడొచ్చు. మరి ఈ కుర్రాళ్లంతా ఎలా ఆడతారో చూడాలి. మరోవైపు తొలి వన్డేలో విజయానికి చేరువగా వచ్చి.. త్రుటిలో మ్యాచ్‌ను చేజార్చుకున్న జింబాబ్వే మరోసారి అలాంటి ప్రదర్శననే పునరావృతం చేయాలని ఆశిస్తోంది. ఐతే జింబాబ్వేకు చెక్ పెట్టి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్, జింబాబ్వే రెండు టీ20ల సిరీస్‌లో తలపడతాయి. మూడో వన్డే మధ్యాహ్నం 12.30కి ప్రారంభమవుతుంది.
Tags:    

Similar News