పాపం యువ క్రికెటర్.. ఎంట్రీలోనే సెంచరీలు.. ఐపీఎల్ లో అన్ సోల్డ్
అది 2017 జనవరి 1.. అంటే దాదాపు 8 సంవత్సరాల కిందట.. కేవలం 17 ఏళ్ల వయసున్న ఓ కుర్రాడు రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
అది 2017 జనవరి 1.. అంటే దాదాపు 8 సంవత్సరాల కిందట.. కేవలం 17 ఏళ్ల వయసున్న ఓ కుర్రాడు రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. అప్పటికే అతడి పేరు దేశమంతా మార్మోగింది.. దీంతో రంజీ మ్యాచ్ అయినా ఆ కుర్రాడి ఆట చూసేందుకు క్రికెట్ అభిమానులు టీవీల ముందు కూర్చున్నారు. అంచనాలకు తగ్గట్లే అతడు సెంచరీ కొట్టేశాడు. సరిగ్గా ఏడాదిలోపే ఆ కుర్రాడి కెప్టెన్సీలో భారత్ కు అండర్ 19 ప్రపంచ కప్ కూడా దక్కింది.. మరికొద్ది నెలల్లోనే అతడు టీమ్ ఇండియాలోకీ వచ్చేశాడు. వస్తూ వస్తూనే ఇక్కడా సెంచరీ బాదేశాడు. ఇంకేం.. అతడే భారత క్రికెట్ సూపర్ స్టార్ అనీ అందరూ పొగడ్తలు కురిపించేశారు. కానీ, ఏడాది తిరిగేసరికి అతడి జాతకం తలకిందులైంది. ఒకే ఒక్క గాయం.. ఒకే ఒక్క ‘ఔట్’ అతడి కెరీర్ ను తలకిందులు చేసింది. ఇదంతా ఎవరి గురించి అంటే..?
రూ.75 లక్షలకు రిజిస్టరైతే..
పృథ్వీ షా.. భారత క్రికెట్లో ఒకప్పుడు మార్మోగిన పేరు. ఇప్పుడు కూడా మార్మోగుతోంది. అయితే అప్పట్లో భవిష్యత్ సూపర్ స్టార్ గా, ఇప్పుడు ఎవరూ పట్టించుకోని క్రికెటర్ గా మిగిలిపోయాడు. 2017లో రంజీ ట్రోఫీ నుంచి 2020 వరకు పృథ్వీ టైమ్ బాగా నడిచింది. కానీ, ఇప్పుడు అతడికి శని మహర్దశ నడుస్తోంది. కెరీర్ పరంగా అత్యంత అధ్వాన స్థితిలో ఉన్నాడతడు. ఒకప్పుడు దేశమంతా షా గురించే మాట్లాడుకునేది. అలాంటివాడికి ఏమిటీ పరిస్థితి అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. తాజా ఐపీఎల్ వేలంలో షా రూ.75 లక్షల ధరకు నమోదు చేసుకుంటే ఎవరూ కొనలేదు.
జైశ్వాల్, పంత్ కంటే ధనాధన్
ఇప్పుడంతా ధనాధన్ బ్యాటింగ్ లో మనం యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్, శుబ్ మన్ గిల్ గురించి మాట్లాడుకుంటున్నాం.. కానీ, వీరందరి కంటే ముందు షా బ్యాటింగ్ ఈ తీరుగా ఉండేది. అది టెస్టు అయినా వన్డే అయినా బౌండరీల మీద బౌండరీలు కొట్టేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంగ్లండ్ టెస్టుల్లో మొదలుపెట్టిన బజ్ బాల్ ను 2018-19లోనే షా ఆడేశాడు. కానీ, విధి అతడి పట్ల మరోలా ప్రవర్తించింది.
ఒక్క గాయం.. ఒక్క మ్యాచ్
2018-19 సీజన్ లో ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి వెళ్లిన జట్టులో షా సభ్యుడు. కచ్చితంగా ఓపెనర్ గా బరిలో దిగేవాడు. అయితే, ప్రాక్టీస్ మ్యాచ్ లో అవనసర క్యాచ్ కోసం పరిగెడుతూ మడమ గాయానికి గురయ్యాడు. దీంతో కొన్నాళ్లు ఆటకు దూరమయ్యాడు. ఇక అప్పటినుంచి అతడిని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2020-21 సీజన్ లోనూ ఆసీస్ టూర్ కు వెళ్లినా.. తొలి మ్యాచ్ గులాబీ టెస్టు కావడం షా పాలిట శాపమైంది. ఆ మ్యాచ్ లో జట్టు 36 పరుగుల అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయినా.. షా (0, 4 పరుగులు)పైనే ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. దీంతో రెండో టెస్టుకు అతడిని తప్పించారు. అప్పటినుంచి మళ్లీ టీమ్ ఇండియా టెస్టు జట్టులోకి రాలేదు పృథ్వీ.
ఆట కంటే వివాదాలతోనే..
పృథ్వీని 2021 జూలైలో శ్రీలంక టూర్ కు తీసుకెళ్లినా విఫలమయ్యాడు. దీంతో ఏ ఫార్మాట్ లోనూ జట్టు సభ్యుడు కాకుండా పోయాడు. పైగా అనంతరం వరుస వివాదాలతో వార్తల్లో నిలిచాడు. హోటల్ లో యూట్యూబర్ తో గొడవ.. ఫిట్ నెస్ పై శ్రద్ధ లేకుండా భారీగా బరువు పెరగడం, ఇంగ్లండ్ వెళ్లి కౌంటీ క్రికెట్ లో రాణిస్తున్న సమయంలో గాయపడడం కెరీర్ ను మరింత దెబ్బతీసింది. అన్నిటికిమించి తాజా రంజీ సీజన్ లో షాను ముంబై జట్టు నుంచి తప్పించారు. ప్రాక్టీస్ విషయంలో క్రమశిక్షణ తప్పడమే దీనికి కారణం. మ్యాచ్ లు ఉన్న సమయంలో అమ్మాయిలతో కనిపించిన షాను జట్టు నుంచి తప్పించి వేరొకరికి చాన్స్ ఇచ్చారు.
క్రికెట్ ఆర్జీవీ..?
షాను ఇప్పుడు అందరూ క్రికెట్ రామ్ గోపాల్ వర్మగా పోలుస్తున్నారు. సూపర్ హిట్ సినిమాలను తీసిన రామ్ గోపాల్ వర్మ తర్వాత తనదైన ప్రవర్తనతో సినిమాలతో టచ్ ను కోల్పోయి సాధారణ దర్శకుడిగా మిగిలిన సంగతి తెలిసిందే. అదే తీరున షా కూడా మారతాడని విశ్లేషణ చేస్తున్నారు. అయితే, షాను ఆర్జీవీ కంటే ముంబైకే చెందిన క్రికెటర్ వినోద్ కాంబ్లీతో పోల్చడమే తగినది. కాంబ్లీ కూడా 30 ఏళ్ల కిందట తన ప్రతిభను ఇలానే వేస్ట్ చేసుకున్నాడు.