ఏసీల్లేని ఒలింపిక్స్.. అథ్లెట్లకు ఉక్కపోత.. పారిస్ చుట్టూ వివాదాల ముసురు

ఒలింపిక్స్ ను నిర్వహిస్తున్న పారిస్ లో సెన్ నది పారుతోంది. ఇందులో పలు పోటీలు నిర్వహించాల్సి ఉంది.

Update: 2024-07-29 11:27 GMT

ఒలింపిక్స్ అంటే ప్రపంచ క్రీడా వేడుకలు.. 200కు పైగా దేశాల అథ్లెట్లు పాల్గొనే ఏకైక క్రీడా సంగ్రామం.. ఇంతటి ఒలింపిక్స్ కోసం ఏకంగా ఓ క్రీడా గ్రామాన్నే నిర్మిస్తారు. అంటే.. మన భాషలో అదొక ప్రత్యేక నగరం అనుకోవాలి. అయితే, ఈసారి పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. కేవలం నేచర్ ఫ్రెండ్లీ అనే కాన్సెప్ట్ తో వీటిని జరుపుతున్నారు. చెప్పడానికి బాగానే ఉంది కానీ.. అథ్లెట్లకు మాత్రం ఉక్కపోతతో చుక్కలు కనిపిస్తున్నాయట.

అనేక వివాదాలు..

ఒలింపిక్స్ ను నిర్వహిస్తున్న పారిస్ లో సెన్ నది పారుతోంది. ఇందులో పలు పోటీలు నిర్వహించాల్సి ఉంది. ప్రారంభ వేడుకలనూ వీటిలో పడవలపై ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, సెన్ నదిలో విపరీతమైన కాలుష్యం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నదిలో పోటీలా? అనే విమర్శలూ వ్యక్తం అయ్యాయి. దీంతో పారిస్ మేయర్ నదిలో ఈతకొట్టి మరీ చూపించాల్సి వచ్చింది. మరోవైపు ప్రముఖ వ్యాఖ్యాత బాబ్‌ బల్లర్డ్‌ ను ఒలింపిక్స్‌ విధుల నుంచి యూరో స్పోర్ట్‌ సంస్థ మధ్యలోనే తొలగించింది. ఆస్ట్రేలియా మహిళా స్మిమ్మర్లు ఆదివారం 4x100 ఫ్రీస్టైల్‌ రిలేలో స్వర్ణం సాధించిన ఈ సందర్భంగా వారి గెలుపును ప్రకటిస్తూ బాబ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అవి కాస్తా సోషల్‌ మీడియాలో దుమారం రేపడమే దీనికి కారణం. పురుషులు, మహిళా క్రీడాకారుల సంఖ్య సమానంగా ఉన్న పారిస్ ఒలింపిక్స్ లో బాబ్‌ వ్యాఖ్యలపై చాలామంది మండిపడుతున్నారు.

అప్పటికప్పుడు 2500 ఏసీల కొనుగోలు

మిగతా వివాదాల మాట ఎలా ఉన్నా అత్యంత ఎకో ఫ్రెండ్లీ ఒలింపిక్స్ గా పారిస్ ఒలింపిక్స్ ను పేర్కొంటున్నారు. దీనికోసమే.. ఆటగాళ్ల గదుల్లో నిర్వాహకులు ఏసీలు ఏర్పాటు చేయలేదు. దీంతో అథ్లెట్లు తీవ్ర ఉక్కపోతను అనుభవిస్తున్నారు. తాము ఉండలేమంటూ ఫిర్యాదులు, విమర్శలు రావడంతో అప్పటికప్పుడు 2,500 ఏసీలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. కాగా, ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలూ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News