తెలుగు అండర్ 19 క్రికెటర్ పై బంగ్లా క్రికెటర్ బూతులు.. ఐసీసీ యాక్షన్
దక్షిణాఫ్రికా వేదికగా ఇటీవల అండర్ 19 ప్రపంచ కప్ మొదలైంది. భావి క్రికెటర్లుగా ఎదిగే చాన్సున్న యువ తారలంతా సఫారీ గడ్డపై పోరాటం సాగిస్తున్నారు
దక్షిణాఫ్రికా వేదికగా ఇటీవల అండర్ 19 ప్రపంచ కప్ మొదలైంది. భావి క్రికెటర్లుగా ఎదిగే చాన్సున్న యువ తారలంతా సఫారీ గడ్డపై పోరాటం సాగిస్తున్నారు. అన్ని జట్ల నుంచి వీరిలో కనీసం పది మందైనా జాతీయ జట్లకు ఎంపికవడం ఖాయం. కాగా, ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన మన జట్టు.. గురువారం ఐర్లాండ్ ను మట్టి కరిపించింది.
ప్రతిభ కనబర్చినా.. నోరు పారేసుకుని
బంగ్లాతో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్, కెప్టెన్ ఉదయ్ మూడో వికెట్‌కు 116 (144 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆదర్శ్ 76 పరుగులు చేయగా, నాలుగో నంబర్‌లో కెప్టెన్ సహారన్ 64 పరుగులు చేశాడు. దీంతో మన జట్టు మెరుగైన స్కోరు చేసింది. ఛేదనలో బంగ్లాదేశ్ ను 167 పరుగులకే ఆలౌట్ చేసింది. కాగా ఇదే మ్యాచ్ లో తెలంగాణకు చెందిన కుర్రాడు అరవెల్లి అవనీష్ 23 పరుగుల కీలక స్కోరు చేశాడు. దూకుడుగా ఆడిన అవనీష్ జట్టుకు విలువైన పరుగులు అందించాడు. కాగా.. అతడిపై బంగ్లా బౌలర్ మరూఫ్ మృదా నోరుపారేసుకున్నాడు. అవనీష్ ను దుర్భాషలాడాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో మరూఫ్ 5 వికెట్లు పడగొట్టి చక్కటి ప్రదర్శన చేశాడు. కానీ, అతడి ప్రవర్తనతో దానిపై ప్రశంసలు అందుకునే అవకాశం కోల్పోయాడు.
ఐసీసీ సీరియస్..
ఇంకా అండర్ 19 దశలో ఉండగానే.. మరూఫ్ ప్రవర్తన తీవ్రంగా ఉండడంతో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మరూఫ్ తీసిన ఐదు వికెట్లలో తెలుగు కుర్రాడు అవనీష్ వికెట్ కూడా ఉంది. అయితే, ఇదే సందర్భంలో అతడు నోరు జారాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికిల్ 2.5 ప్రకారం ఆటగాడు, ఆటగాడి సహాయకులను దూషించినందుకు మరూఫ్ కు ఒక డీ మెరిట్ పాయింట్ కోత విధించింది. మరోవైపు ఆరవెల్లి అవనీష్ తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన కుర్రాడు. ఇతడి తండ్రి అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిరపడినా.. కుమారుడిని క్రికెటర్ చేయాలన్న లక్ష్యంతో స్వదేశానికి తిరిగొచ్చారు. తల్లి పట్టుదల కూడా తోడవడంతో అవనీష్ క్రికెట్ లో మెరుగ్గా రాణిస్తున్నాడు. డిసెంబరులో జరిగిన ఐపీఎల్ వేలంలో అవనీష్ ను దిగ్గజ జట్టయిన చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షల ప్రాథమిక ధరకు సొంతం చేసుకుంది. కాగా, అవనీష్ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్. మంచి టైమింగ్, దూకుడు అతడి సొంతం. దీంతోనే అవనీష్ కు చక్కటి భవిష్యత్ ఉందని అంచనా వేస్తున్నారు. చెన్నై జట్టులో దిగ్గజం ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం దక్కడం అవనీష్ కెరీర్ ను మలుపు తిప్పుతుంది అనడంలో సందేహం లేదు.