ఛీ..ఛీ.. బీసీసీఐ: స్టేడియంలు కావు పంట పొలాలు!

మైదానంలోని పచ్చిక సరిగా లేకపోవటం.. క్యాచ్ పడుతూ లివింగ్ స్టన్ కింద పడిన వేళ.. పెళ్లల పెళ్లలుగా మట్టి అట్టలు బయటకురావటం చూసి నోరెళ్లబెడుతున్నారు

Update: 2023-10-30 04:41 GMT

ప్రపంచ కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీని నిర్వహించే విషయంలోనే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న.. శక్తివంతమైన భారత క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న వైఖరి దేశ పరువు తీసేలా మారింది. వేలాది కోట్ల సంపాదన ఉన్న ఈ క్రికెట్ బోర్డు తాజాగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ టోర్నీలో మ్యాచ్ లకు షెడ్యూల్ చేసిన క్రీడా మైదానాల తీరుపై ఆటగాళ్లు మండిపడుతున్నారు. పచ్చని గడ్డి కనిపిస్తున్నా.. ఏ మాత్రం సరిగా సిద్ధం చేసిన వైనం ఆటగాళ్లను బెంబేలెత్తిస్తోంది. బంతిని పట్టుకోవటానికి డ్రైవ్ చేసేందుకు సైతం క్రీడాకారులు భయపడుతున్నారంటే.. ఔట్ ఫీల్డ్ ఎంత బాగా తయారు చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

మొన్నటికి మొన్న ధర్మశాల క్రికెట్ స్టేడియంలోని ఔట్ ఫీల్డ్ చూసినోళ్లంతా నోరెళ్లబెట్టారు. ప్రపంచకప్ టోర్నీకి స్టేడియంను ఇలా సిద్ధం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా లక్నో స్టేడియంపై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే.. ఔరా అనుకోవాల్సిందే. దేశ పరువును తీసేలా బీసీసీఐ వ్యవహరిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ రోజు లక్నో వేదికగా భారత్ - ఇంగ్లండ్ టీం మధ్య జరిగిన మ్యాచ్ లో.. అటల్ బిహారీ స్టేడియం నిర్వహణను తిట్టి పోస్తున్నారు.

దీని నిర్వహణ.. పంట పొలాల కంటే అధ్వానంగా ఉందని మండిపడుతున్నారు. మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మ షాట్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో లివింగ్ స్టోన్ గాయపడిన తీరును చూసినోళ్లంతా.. మ్యాచ్ కోసం స్టేడియంను సిద్ధంచేసిన తీరును తప్పు పడుతున్నారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. తిట్ల వర్షం కురిపిస్తున్నారు.

మైదానంలోని పచ్చిక సరిగా లేకపోవటం.. క్యాచ్ పడుతూ లివింగ్ స్టన్ కింద పడిన వేళ.. పెళ్లల పెళ్లలుగా మట్టి అట్టలు బయటకురావటం చూసి నోరెళ్లబెడుతున్నారు. ధర్మశాల గ్రౌండ్ సైతం ఇదే రీతిలో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ టోర్నీని నిర్వహించే వేళ.. బీసీసీఐ ఏం చేస్తున్నట్లు? క్రీడా మైదానాల్ని సరిగా సిద్ధం చేయాలన్న కామన్ సెన్సు కూడా లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News