ఫ్యాన్స్.. ఊపిరి బిగపట్టండి.. మార్చి 1న మరో మహా సమరం
ఆ రెండు దేశాలు ముఖాముఖి సిరీస్ లలో తలపడక పదేళ్లు అవుతోంది.. వారి దేశానికి వీరు వెళ్లేది లేదు.. వీరి దేశానికి వారు వచ్చేది లేదు
ఆ రెండు దేశాలు ముఖాముఖి సిరీస్ లలో తలపడక పదేళ్లు అవుతోంది.. వారి దేశానికి వీరు వెళ్లేది లేదు.. వీరి దేశానికి వారు వచ్చేది లేదు.. ఒక్క మ్యాచ్ జరిగినా వందల కోట్లు లాభం. కానీ, అందుకు అవకాశమే లేదు. వారి మధ్య సమరాన్ని చూడాలంటే అంతర్జాతీయ టోర్నీలే దిక్కు.
భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగినా అదో పెద్ద క్రేజ్. ఈ రెండు దేశాల్లోనే 170 కోట్ల మందిపైగా ప్రజలున్నారు. వీరిలో వందకోట్ల మంది వరకు మ్యాచ్ చూస్తారు. ఇతర దేశాలకు చెందిన మరో 15-20 కోట్ల మంది అయినా మ్యాచ్ ను వీక్షిస్తారు.
ఆరు నెలలకో మ్యాచ్ కూడా కరువు?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టోర్నీలు లేకుంటే భారత్-పాకిస్థాన్ మధ్య ఆర్నెల్లకో మ్యాచ్ కూడా జరగదు. కాగా, గత ఏడాది భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు ప్రపంచంలో అతిపెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంతో తలపడిన సంగతి తెలిసిందే. గత ఆదివారం న్యూయార్క్ నసావు కౌంటీలోనూ ఈ రెండూ టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లో ఢీకొన్నాయి. ఈ రెండుసార్లూ భారత్ నే విజయం వరించింది.
తొమ్మిది నెలలకోసారి..
అక్టోబరు నుంచి చూస్తే ఈ జూన్ కు 9 నెలలు. ఈ వ్యవధిలో టీమిండియా-పాకిస్థాన్ రెండుసార్లు తలపడ్డాయి. మరిక మళ్లీ ఎప్పుడు? అనే సందేహం వస్తోంది కదూ..? దీనికి వచ్చే మార్చి వరకు ఆగక తప్పదు.
మార్చి 1 లాహోర్ లో
చరిత్రలో ప్రసిద్ధిగాంచిన లాహోర్ నగరంలో 2025 మార్చి 1న భారత్-పాకిస్థాన్ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తలపడనున్నాయి. ఈ సారి ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ.. అక్కడ ఆడేందుకు మాత్రం భారత్ అంగీకరించడం లేదు. దీనిపై వివాదం నెలకొంది. భారత్ ను ఎలాగైనా తమ దేశానికి రప్పించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారత్ లో వన్డే కప్ సందర్భంగా పాక్ పర్యటనపై వివాదం జరిగింది. అయితే, ఆ జట్టు చివరకు మన దేశానికి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.