ఈ దిగ్గజాలంతా వచ్చే ప్రపంచ కప్ నకు ఉండరు

భారత్ ఏకైక వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ముగిసింది. కేవలం వంద రోజుల ముందు మాత్రమే షెడ్యూల్ ఖరారైనా.. అద్వితీయ నిర్వహణ సామర్థ్యంతో కప్ విజయవంతమైంది

Update: 2023-11-20 08:01 GMT

భారత్ ఏకైక వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ముగిసింది. కేవలం వంద రోజుల ముందు మాత్రమే షెడ్యూల్ ఖరారైనా.. అద్వితీయ నిర్వహణ సామర్థ్యంతో కప్ విజయవంతమైంది. ఎప్పటిలాగానే కొన్ని విమర్శలు వచ్చినా.. అవి దూదిపింజల్లా తేలిపోయాయి. ఇక ఆటపరంగా చూస్తే కొందరు అద్భుత ప్రదర్శనతో రికార్డులకెక్కారు. మరికొందరు తీవ్రంగా నిరాశపరిచారు. ఇంకొందరు కెరీర్ లో చివరి ప్రపంచ కప్ ఆడేశారు.

వీళ్లు కనిపించకపోవచ్చు..

టెస్టుల్లో చాంపియన్ షిప్ ను తీసుకొచ్చినప్పటికీ, టి20లకూ ప్రపంచ కప్ ఉన్నప్పటికీ వన్డే ప్రపంచ కప్ రేంజ్ వేరు. అసలైన చాంపియన్ అంటే వన్డే చాంపియన్ అనే అనుకోవాలి. అందుకనే వన్డే ప్రపంచ కప్ స్థాయి ఉన్నతం. మరి ఆదివారంతో ప్రపంచ కప్ 13వ ఎడిషన్ ముగిసింది. మరో కప్ నకు నాలుగేళ్లు ఆగాలి. ఇక ఇప్పటికే ముప్పై ఏళ్లు దాటిన ఆటగాళ్లు వచ్చేసారి ప్రపంచ సమరంలో ఆడతారని చెప్పలేం. ఇంకొందరు ఇప్పటికే చివరి కప్ ఆడేశారు. వారిలో ముఖ్యులు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఏస్ పేసర్ మొహమ్మద్ షమీ. ఓ విధంగా చూస్తే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా.

రోహిత్ మరో ఏడాదే?

టీమిండియాను వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేర్చిన రోహిత్ శర్మ వచ్చే కప్ ఆడడని చెప్పొచ్చు. ప్రస్తుతం 37వ ఏడాదికి దగ్గరగా ఉన్న అతడికి 2027 కప్ నకు 40 ఏళ్లు వస్తాయి. ఫిట్ నెస్ పరంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోహిత్.. టి20ల నుంచి తప్పుకొన్నాడు. వన్డేలు కూడా ఏడాది ఆడతాడు అంతే. టెస్టుల్లో కనీసం రెండేళ్లు కొనసాగి రిటైర్మెంట్ ప్రకటించే వీలుంది. 33 ఏళ్ల మహమ్మద్ షమి కూడా చివరి ప్రపంచ కప్ ఆడేశాడు. ప్రస్తుతం అతడు జోరుమీదున్నప్పటికీ.. 2027 నాటికి 37 ఏళ్లకు చేరతాడు. ఓ పేసర్ గా అప్పటివరకు ఫిట్ నెస్ కాపాడుకోవడం కష్టమే. ఈ జాబితాలో మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు స్పిన్ ఆల్ రౌండర్లు అశ్విన్‌ (37), జడేజా (34).

కోహ్లి ఉంటాడా..?

ప్రపంచంలో అత్యంత ఫిట్ నెస్ ఉన్న క్రికెటర్ అయిన విరాట్ కోహ్లికి వచ్చే ప్రపంచ కప్ నాటికి 39 ఏళ్లు వస్తాయి. కానీ, ఫిట్ నెస్ పరంగా చూస్తే కోహ్లి కొనసాగొచ్చు. అయితే, పట్టుబట్టి మరీ ఈ ప్రపంచ కప్‌ కోసం వన్డే రిటైర్మెంట్‌ నిర్ణయం విరమించుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌, అనూహ్యంగా అవకాశం దక్కించుకున్న ఏంజెలో మాథ్యూస్‌ 2027లో ఆడరని చెప్పొచ్చు.

38 ఏళ్ల మహమ్మద్‌ నబి (అఫ్గానిస్థాన్‌), 37 ఏళ్ల వార్నర్‌, 34 ఏళ్ల స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, 33 ఏళ్ల స్టార్క్‌ (ఆస్ట్రేలియా), 33 ఏళ్ల విలియమ్సన్‌, 34 ఏళ్ల బౌల్ట్‌, సౌథీ (న్యూజిలాండ్‌), 36 ఏళ్ల షకిబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీం (బంగ్లాదేశ్‌), డేవిడ్‌ మలన్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లాండ్‌), బవుమా, మిల్లర్‌, వాండర్‌ డసన్‌ (దక్షిణాఫ్రికా) తదితరులూ వచ్చే ప్రపంచ కప్ లో పాల్గొనడం కష్టమే. అయితే 31 ఏళ్ల దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ క్వింటన్ డికాక్‌ (దక్షిణాఫ్రికా) నిర్ణయం మాత్రం ఆశ్చర్చపరిచేదే. దీనిని వెనక్కుతీసుకుంటే అతడికే మేలు.

Tags:    

Similar News