మొన్న ‘900’ నేడు 100 కోట్ల ఫాలోవర్లు.. దిగ్గజ ఫుట్ బాలర్ మరో చరిత్ర

పోర్చుగల్ పుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-09-13 07:21 GMT

మనకు ఫేస్ బుక్ లో వెయ్యిమంది ఫాలోవర్లు ఉంటేనే అబ్బో అనుకుంటాం.. ఇన్ స్టాలో మన రీల్స్ 500 మంది చూసినా అహో అనుకుంటాం.. మన ట్వీట్ ను 100 రీ ట్వీట్ చేస్తేనే అమ్మో మొనగాళ్లమని భావిస్తాం.. యూట్యూబ్ లో మన చానల్ ను 2 వేల మంది సబ్ స్రైబ్ చేసుకుంటేనే సంబరపడిపోతాం.. కానీ.. అతడి సోషల్ మీడియా ఖాతాలు చూస్తే మనకు శోష (మూర్ఛ) వచ్చి పడిపోతాం.. వెయ్యి, లక్ష కాదు.. కోటి అంతకన్నా కాదు.. కనివినీ ఎరుగని సంఖ్య అది.

900 కొట్టిన కొన్ని రోజులకే..

పోర్చుగల్ పుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కొద్ది రోజుల కిందటనే రొనాల్డో 900వ గోల్ కొట్టాడు. దిగ్గజం పీలే, సమకాలీకుడు మెస్సీ సహా ఎవరికీ సాధ్యం కాని రికార్డు ఇది. రొనాల్డో ను ఈ విషయంలో భవిష్యత్ లో అధిగమించేవారు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అతడు మరో రికార్డునూ సొంతం చేసుకున్నాడు.

అతడి గోల్స్ మాదిరిగానే..

రొనాల్డో సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటాడు. ఇటీవల 900వ గోల్ కొట్టిన సందర్భంగానూ మనం చరిత్రలోకెక్కాం అనే రీతిలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు తన సోషల్ మీడియాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. అతడికి ఉన్న ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య 100 కోట్లను దాటింది. ఇది ప్రపంచంలో రొనాల్డోకే సాధ్యమైన ఘనత. దీనిపై అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. ‘మనం చరిత్ర సృష్టించాం.. 100 కోట్ల ఫాలోవర్లు సంఖ్య మాత్రమే కాదు. అంతకుమించి.. ఇది మీ ప్రేమాభిమానాలకు నిదర్శనం’ అని పేర్కొన్నాడు.

మడైనా వీధుల నుంచి

పోర్చుగల్ లోని మడైరా రొనాల్డో స్వస్థలం. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని గుర్తుచేసుకుంటూ.. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు.. తాను కుటుంబంతో పాటు అభిమానుల కోసమే ఆడానని రొనాల్డో పోస్ట్ చేశాడు. వంద కోట్లమంది తన కోసం నిలబడ్డారని.. తన ఎత్తుపల్లాల్లో, ప్రతి అడుగులో అండగా నిలిచారని కొనియాడారు. ఇది మన జర్నీ.. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించామని ప్రకటించాడు. తనపై నమ్మకం ఉంచి.. ఎల్లవేళలా అండగా ఉన్నందుకు, తన జీవితంలో భాగమైన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.

ఇంకా ఆడతా..

38 ఏళ్ల రొనాల్డోను రెండేళ్ల కిందట జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్ లో కీలక దశలో పక్కనపెట్టారు మేనేజర్. దీంతో అతడు రిటైర్ కావడం ఖాయమని భావించారు. ఇప్పుడు మాత్రం తాను ఇంకా ఉత్తమ ప్రదర్శన చేయాల్సి ఉందని అతడు అంటున్నాడు. మరిన్ని విజయాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలంటున్నారు. రొనాల్డో గతంలోనే ఇన్ స్టా, ఫేస్ బుక్ లలో ఉన్నాడు. ఇటీవలే యూట్యూబ్ లోకి వచ్చాడు. కొద్ది రోజులోనే అతడి ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. ఇప్పటికే 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌ స్టాలో రొనాల్డోను 63.9 కోట్లమంది, ‘ఎక్స్‌’లో 11.3 కోట్ల మంది, ఫేస్‌ బుక్‌ లో 17 కోట్ల మంది అనుసరిస్తున్నారు.

కొసమెరుపు: వాట్సాప్ ను సోషల్ మీడియాగా పరిగణించరు. అది మెసెంజర్ అని అంటుంటారు. ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా, ఎక్స్ తదితరాలు సోషల్ మీడియా. ఇవన్నీ కలిపితే రొనాల్డోకు ఉన్న ఫాలోవర్లు 97 కోట్లే.. మరి మిగతా మూడు కోట్ల మంది ఏ సోషల్ మీడియాలో ఉన్నారో?

Tags:    

Similar News