షాకిచ్చిన చెన్నై.. వచ్చే సీజన్ కు ఇదే బిగ్ డెసిషన్

మధ్యలో పుణె సూపర్ జెయింట్స్ గా మారినా అతడు చెన్నైను వీడలేదు.

Update: 2024-10-31 21:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే అందరూ చెప్పేది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అనే. 17 సీజన్లలో ఐదు టైటిళ్లు దాని సొంతం. ఆరుసార్లు ఫైనల్ (పుణె సూపర్ జెయింట్స్ గానూ) చేరింది. చెన్నై కనీసం నాకౌట్ కు చేరగలదు అని అభిమానుల నమ్మకం. అయితే, దీనంతటికీ కారణం ఆ జట్టు వెన్నెముక అయిన మహేంద్ర సింగ్ ధోనీ. 2008 నుంచి చెన్నైనే అట్టిపెట్టుకున్నాడు ధోనీ. మధ్యలో పుణె సూపర్ జెయింట్స్ గా మారినా అతడు చెన్నైను వీడలేదు. అటు చెన్నై కూడా మూడేళ్ల కిందట ధోనీ కెప్టెన్సీ వదలిసినా.. అతడి వయసు మీదపడుతున్నా చెన్నై మాత్రం అతడిని వదులుకోలేదు. అలాంటిది ఈసారి షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

ముగ్గురు కెప్టెన్లను వదులుకున్న ఫ్రాంచైజీలు

ఐపీఎల్ లో చెన్నై, ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ లకు మంచి వ్యూహాలు పన్నేవాటిగా పేరుంది. ఇప్పుడు ధోనీని చెన్నై వదులుకుందంటే దానివెనుక బలమైన కారణం ఉండే ఉంటుంది. అయితే, అన్ని ఫ్రాంచైజీల్లో వచ్చే సీజన్ కు ముగ్గురు ఆటగాళ్లపై ఫోకస్ ఉంది. వారు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్, కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్. గమనార్హం ఏమంటే.. ఈ ముగ్గురినీ ఆయా ఫ్రాంచైజీలు వదులుకుంటున్నాయి.

అతడు చెన్నైకే..

రిషభ్ పంత్ చాన్నాళ్లుగా ఢిల్లీకి ఆడుతున్నాడు. అతడిని ఈసారి ఢిల్లీ మెగా వేలానికి వదిలేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే పంత్ ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీకేఎస్) ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. వేలంలో పంత్ ను తీసుకునేందుకు ఢిల్లీ సిద్ధమైందట. కాగా, టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా సీఎస్కే షాక్ ఇవ్వనుందట. అతడిని వేలంలోకి విడుదల చేయనుందట. మూడేళ్ల కిందట జడేజాకు చెన్నై కెప్టెన్సీ ఇవ్వగా జట్టు వైఫల్యాలతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో జడేజా మధ్యలోనే వైదొలిగాడు.

ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు..

పంత్ ను చెన్నై తీసుకోవాలని చూడడం వెనుక బలమైన నేపథ్యమే ఉంది. పంత్ హార్డ్ హిట్టింగ్ వికెట్ కీపర్. ధోనీకి ఇప్పడు 43 ఏళ్లు. అతడు ఈ సీజన్ కు మాత్రమే ఆడే చాన్సుంది. వచ్చే సీజన్ నుంచి మరో కొత్త ఆటగాడిని తీసుకోవాల్సిందే. అందుకనే పంత్ ను ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారట. కాగా, ఇదే సమయంలో ఢిల్లీ తమ కెప్టెన్ అయిన పంత్ ను ఎందుకు వదిలేస్తున్నదో తెలియాలి.

రూ.20 కోట్లు దాటనున్న తొలి భారత క్రికెటర్

పంత్ కోసం సీఎస్కే భారీ మొత్తం ఖర్చు పెట్టనుందట. అది రూ.20 కోట్లు పైనే ఉంటుందట. అదే జరిగితే 20 కోట్లుపైగా దక్కిన తొలి భారత క్రికెటర్ రిషభ్ పంత్ గా నిలుస్తాడు. ఇక జడేజాను వేలంలోకి విడుదల చేసినా.. రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా అతడిని తీసుకుంటుందట.

Tags:    

Similar News