ఇంకా ఆ షాట్ షాక్ లోనే దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
టి20 ప్రపంచ కప్ ఫైనల్లో శనివారం చివరి ఓవర్ తొలి బంతిని దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ ముగిసి మూడు రోజులవుతోంది.. భారత అభిమానులు ఆ మధుర క్షణాలను మర్చిపోలేకపోతున్నారు.. రోహిత్ శర్మ ప్రపంచ కప్ అందుకున్న సందర్భాన్ని.. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ ను ఎంతగానో తలచుకుంటున్నారు. కానీ, ఒక ప్లేయర్ మాత్రం తానెందుకు ఆ షాట్ కొట్టానా..? ఫుల్ టాస్ బంతిని ఎందుకు సిక్స్ గా మలచలేకపోయానా? అని బాధపడుతున్నాడు.
ఆ షాట్ గనుక సిక్స్ అయితే..
టి20 ప్రపంచ కప్ ఫైనల్లో శనివారం చివరి ఓవర్ తొలి బంతిని దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ సిక్స్ కొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ బంతిని బౌండరీ లైన్ దగ్గర సూర్యకుమార్ యాదవ్ కళ్లుచెదిరే రీతిలో పట్టాడు. లేదంటే ఆ బాల్ సిక్స్ గా వెళ్లేదే. 6 బంతుల్లో 16 పరుగుల విజయ సమీకరణం కాస్త.. 5 బంతుల్లో 10 పరుగులు అయ్యేది. దీంతోపాటే మ్యాచ్ కూడా పోయేదే..? కానీ.. జరిగింది వేరు. మిల్లర్ ఔట్ తో పాటు దక్షిణాఫ్రికా తనకు అలవాటైన ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. చివరికి ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడా షాట్ ను తలచుకునే మిల్లర్ కుమిలిపోతున్నాడు.
మైదానంలోనే ఏడ్చేసి..
ఫైనల్లో ఓటమి అనంతరం దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మిల్లర్ మైదానంలోనే ఏడ్చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేదని సమాచారం. దీనిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘రెండు రోజుల కిందట జరిగిన దాన్ని మర్చిపోలేకున్నా.. చాలా ఇబ్బందిగా ఉంది. అదో చేదు అనుభవం. దానిని వర్ణించడానికి పదాలు చాలవు. అయితే, మా జట్టును తలచుకుని గర్వపడుతున్నాను. గత నెల రోజులుగా ఎత్తుపల్లాలు చూశాం. నమ్మశక్యం కాని రీతిలో ఆడాం. మా జట్టు మళ్లీ పైకి లేస్తుంది’’ అని చెప్పాడు. కాగా, మ్యాచ్ తర్వాత మిల్లర్ కంటతడి పెడుతున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అతడి పోస్ట్.. మిల్లర్ ఇంకా వేదనలో ఉన్నాడని స్పష్టం చేస్తోంది.