పాక్ కు 6.9 అడుగుల హైదరాబాదీ కుర్ర పేసర్ బౌలింగ్.. ఎవరతడు?
అత్యంత ఎత్తైన క్రికెటర్లు మన దేశం నుంచి తక్కువే. మన పరిస్థితులకు తగ్గట్లుగా క్రికెటర్లు సగటు ఎత్తు 5.8 వరకు ఉంటారు
క్రికెట్ లో పేస్ బౌలింగ్ కు ఉండే ప్రాధాన్యం వేరు. అలాగని స్పిన్ బౌలింగ్ స్థాయి తక్కువేమీ కాదు. అయితే, రెండింటితో పోలిస్తే పేసర్లకే కాస్త విలువెక్కువ. మంచి రనప్ తో వేగంతో స్వింగ్ రాబడుతూ వైవిధ్యంగా బంతులేసే పేస్ బౌలర్లంటే ఒక్క క్షణం ఆగి మరీ చూస్తారు. అందులోనూ ఆరడుగుల ఎత్తుండే పేసర్లపై ఓ లుక్కేసి ఉంచాల్సిందే. ఇప్పుడిలానే ఓ హైదరాబాదీ కుర్ర క్రికెటర్ అత్యంత ఆసక్తి రేపుతున్నాడు.
హయ్యస్ట్ హైట్
అత్యంత ఎత్తైన క్రికెటర్లు మన దేశం నుంచి తక్కువే. మన పరిస్థితులకు తగ్గట్లుగా క్రికెటర్లు సగటు ఎత్తు 5.8 వరకు ఉంటారు. భారత ఆటగాళ్లలో ముంబై పేసర్ అభయ్ కురువిల్లా (6.49 అడుగులు). ఇతడిది స్వతహాగా కేరళ అయినా ముంబైకి ఆడాడు. భారత్ 10 టెస్టులు, 25 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ ఎత్తు 6.3 అడుగులు. జవగల్ శ్రీనాథ్, మునాఫ్ పటేల్ వీరంతా ఆరడుగులపైనే ఉంటారు. ప్రస్తుత పేసర్లలో పంజాబ్ కు చెందిన అర్షదీప్ సింగ్ (6.2 అడుగులు) అత్యంత పొడగరి ఆటగాడు.
వారిని తలదన్నేలా హైదరాబాదీ
ఇప్పుడు ఆడుతున్న క్రికెటర్లలో పొడగరి ఎవరంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన మార్కొ జన్ సెన్. 6.7 అడుగులుండే ఇతడు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. అయితే, చరిత్రలోనే అత్యంత పొడగరి క్రికెటర్ ఎవరంటే మాత్రం పాకిస్థాన్ కు చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్. ఇతని ఎత్తు 7.1 అడుగులు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ లో ఏడు అడుగుల పైన ఎత్తున్న ఏకైక క్రికెటర్ ఇతడే.
వస్తున్నాడు.. హైదరాబాదీ పేసర్
వర్తమాన ప్రపంచ క్రికెట్ లో అత్యంత పొడగరి క్రికెటర్ రికార్డు దక్కించుకునేందుకు వస్తున్నాడో యువ హైదరాబాదీ పేసర్. అతడి ఎత్తు 6.9 అడుగులు. అంటే.. అతడు గనుక భారత జట్టుకు ఎంపికైతే అత్యంత పొడగరి క్రికెటర్ గా నిలుస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్ అండర్-19 జట్టుకు ఆడుతున్న అతడి పేరు నిశాంత్ శరణు. ఇటీవల ప్రాక్టీస్ సెషన్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ కు నిశాంత్ బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా అతడిపై అందరి కళ్లూ నిలిచాయి. కాగా పేసర్లకు ప్రధాన బలం ఎత్తు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ నిశాంత శరణు రాణిస్తే టీమిండియాకు ఎంపికవడం ఖాయం. తద్వారా ప్రపంచంలో పొడగరి క్రికెటర్ గా రికార్డులకెక్కుతాడు.