ఇదేందయ్యా ఇది.. సంరంభం లేకుండానే ఆరంభమా?
ఏ పోటీల్లో అయినా సరే.. ప్రపంచ సమరాలంటే అల్టిమేట్. అందులో గెలిచినవారు విశ్వవిజేతగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు
ఏ పోటీల్లో అయినా సరే.. ప్రపంచ సమరాలంటే అల్టిమేట్. అందులో గెలిచినవారు విశ్వవిజేతగా కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. అందుకే ప్రది దేశమూ ప్రపంచ కప్ లు, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీలడల వంటి పెద్ద క్రీడా వేడుకలను అత్యంత అట్టహాసంగా జరుపుతుంటారు. అయితే, ఈసారి ఏమైందో ఏమో దీనికి భిన్నంగా జరుగుతోంది.
తొలిసారి సొంతంగా
భారత్ వేదికగా ప్రపంచ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. గత ప్రపంచ కప్ ఫైనల్లో ఈ రెండు జట్లూ ఎంత హోరాహోరీగా తలపడ్డాయో తెలిసిందే. అలాంటి జట్ల మధ్య మరోసారి ప్రపంచ కప్ మ్యాచ్ అంటే అందరికీ ఆసక్తే. ఓ విధంగా చెప్పాలంటే భారత్-పాక్, భారత్-ఆస్ట్రేలియా తరహాలో ప్రజలు, అభిమానులు ఈ మ్యాచ్ ను ఆసక్తికరంగా చూస్తారు.
చరిత్రలో తొలిసారి సొంతంగా
భారత్ లో ప్రపంచ కప్ జరగడం ఇది నాలుగోసారి. అయితే, 1987లో పాకిస్థాన్, 1996లో శ్రీలంక, 2011లో బంగ్లాదేశ్ లను భాగస్వాములుగా చేసుకుని భారత్ కప్ నకు ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి మాత్రం భాగస్వామ్య బాదరబందీ లేకుండా సొంతంగా నిర్వహిస్తోంది. క్రికెట్ చరిత్రలో ఒంటిచేత్తో ఆతిథ్యం ఇస్తున్న దేశం భారత్ మాత్రమే కావడం విశేషం.
మరి సంరంభాలు గట్టిగా లేవేం?
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ కు నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. కానీ, ప్రపంచ కప్ స్థాయి ఆరంభ సంబరాలు లేకుండానే టోర్నీని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్ల కార్యక్రమంతో సరి..
ప్రపంచ కప్ మొదలుకు ముందు రోజైన బుధవారం మోదీ స్టేడియంలో 10 జట్ల కెప్టెన్లతో కార్యక్రమం నిర్వహించారు. దీనిని ఐసీసీనే నిర్వహించింది. ఇక గురువారం నేరుగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ తోనే ప్రపంచ కప్ ను ప్రారంభించేస్తోంది.
కొసమెరుపు: ఆసియా కప్ ఇటీవల చైనాలో మొదలైంది. దానికి అట్టహాసంగా ఆరంభ వేడుకలు చేపట్టారు. కానీ, భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ కప్ ప్రారంభాన్ని మాత్రం కేవలం కెప్టెన్ల కార్యక్రమంతో సరిపెట్టడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. అందులోనూ అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే కప్ లో ఇలా జరగడం ఎంతైనా అభిమానులకు మింగుడుపడనిదే.