ఐసీసీ వరల్డ్ కప్ టీం కెప్టెన్‌ గా రోహిత్‌... పాక్ బోర్డు, బంగ్లా కెప్టెన్ కీలక నిర్ణయం!

ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. దీంతో వన్డే ప్రపంచ కప్‌ 2023 సంగ్రామం ముగిసినట్లయ్యింది.

Update: 2023-11-21 03:49 GMT

ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. దీంతో వన్డే ప్రపంచ కప్‌ 2023 సంగ్రామం ముగిసినట్లయ్యింది. ఈ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. మరోపక్క మెగా టోర్నీలో పాక్‌ లీగ్ స్టేజ్‌ కే పరిమితమై ఇంటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోపక్క బంగ్లాదేశ్ కెప్టేన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఇంకోపక్క ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌ గా రోహిత్‌ ఎంపికయ్యాడు!

అవును... ఈ వరల్డ్ కప్ సందర్భంగా ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరి ముఖ్యంగా శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు వారి వారి జట్ల పెర్ఫార్మెన్స్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీలంక బోర్డునే క్లోజ్ చేసే స్థాయి నిర్ణయాన్ని ప్రకటించగా.. పాకిస్థాన్ బోర్డులో సమూల మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పాక్ ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇంజమామ్‌ కు ఉద్వాసన... రియాజ్ కు ఛాన్స్!

ఈ నేపథ్యంలో కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పాకిస్థాన్ సారధి బాబర్ ఆజాం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టు జట్టుకు షాన్‌ మసూద్‌ ను, టీ20లకు షహీన్‌ షా అఫ్రిదిని కెప్టెన్లుగా నియమించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్. ఇదే సమయంలో తాజాగా చీఫ్‌ సెలెక్టర్‌ గా ఉన్న ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో వాహబ్ రియాజ్‌ ను చీఫ్ సెలక్టర్‌ గా నియమించింది.

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ 38 ఏళ్ల వాహబ్‌ రియాజ్‌... ఆ జట్టు తరఫున అంతర్జాతీయంగా 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. చివరిసారిగా 2020లో మ్యాచ్‌ ఆడాడు. ఇక... ఉద్వాసనకు గురైన ఇంజమామ్‌ ఉల్‌ హక్‌... 120 టెస్ట్ మ్యాచ్ లు, 378 వన్ డే మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెస్టుల్లో 8,830 పరుగులు చేసిన ఇంజమామ్‌... వన్ డేల్లో 11,739 పరుగులు చేశాడు.

బంగ్లా కెప్టెన్ పొలిటికల్ ఎంట్రీ!:

వరల్డ్‌ కప్‌ లో బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరించిన షకిబ్ అల్‌ హసన్ కొత్త అవతారం ఎత్తాడు. ఇందులో భాగంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాడు. “బంగ్లాదేశ్‌ అవామీ లీగ్” తరఫున నామినేషన్‌ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ తరఫున షకిబ్‌ అభ్యర్థిత్వాన్ని బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా ధ్రువీకరించారు.

డిస్నీ హాట్‌ స్టార్‌ "ప్రపంచ" రికార్డు!:

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ ను దాదాపు 5.9 కోట్ల మంది వీక్షించారు. దీంతో టీం ఇండియా – న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్‌ ను 5.3 కోట్ల వ్యూస్‌ రికార్డును ఫైనల్‌ మ్యాచ్‌ అధిగమించేసింది. ఈ ఫైనల్‌ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి కప్‌ ను దక్కించుకుంది. ఒకానొక దశలో వార్ వన్ సైడ్ అనే పరిస్థితి కనిపించడంతో టీం ఇండియా అభిమానులు మ్యాచ్ చూసే ధైర్యం చేయలేకపోయారని అంటున్నారు. అలా కాకుండా... మ్యాచ్‌ మరింత ఉత్కంఠగా సాగి ఉంటే వ్యూస్‌ మరింత భారీగా వచ్చే అవకాశం ఉండేదని అంటున్నారు.

ఐసీసీ వరల్డ్ కప్ జట్టు కెప్టెన్‌ గా రోహిత్‌:

ప్రపంచకప్‌ లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఐసీసీ 11 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ జట్టుకు సారథిగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. ఈ జట్టులో రోహిత్ తో సహా ఆరుగురు టీం ఇండియా ఆటగాళ్లు ఉండటం గమనార్హం. వారిలో ఈ టోర్నీలో "ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ" గా నిలిచిన విరాట్ కొహ్లీ.. కేఎల్‌ రాహుల్‌, జస్‌ ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, రవీంద్ర జడేజాలు ఉన్నారు.

ఐసీసీ టీం ఆఫ్‌ ద టోర్నీ: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), డరిల్‌ మిచెల్‌, గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌, రవీంద్ర జడేజా, జస్‌ ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఆడం జంపా, దిల్షాన్‌ మదుశంక, గెరాల్డ్‌ కొయెట్జీ (12వ ఆటగాడు)!

Tags:    

Similar News