భారత్ ఓడింది.. మాకు పరమానందం.. పాక్ క్రికెటర్ ప్రేలాపన
కానీ, ప్రస్తుత తరం క్రికెటర్ల ఆలోచనా ధోరణి అలా లేదు. దీనికి నిదర్శనమే పాక్ క్రికెటర్ తాజా వ్యాఖ్యలు.
అది 1992 ప్రపంచ కప్ సమయం.. ఆస్ట్రేలియాలో జరిగిన నాటి టోర్నీలో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. పాకిస్థాన్ మాత్రం పడుతూ లేస్తూ సెమీస్ చేరి.. ఆపై ఫెనల్లోనూ గెలిచి కప్ కొట్టేసింది. ఆ విజయం అనంతరం అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను మీడియా ఓ ప్రశ్న అడిగింది. ‘‘మీరు కప్ గెలిచారు. భారత్ ఓడిపోయింది. దీనిపై ఏమంటారు?’’ అని.. దీనికి ఇమ్రాన్ ఇచ్చిన సమాధానం అభిమానుల మనసులను గెలిచుకుంది. ఇంతకూ అతడు ఏమన్నాడంటే.. ‘మేం కప్ గెలిచినా, భారత్ గెలిచినట్లే’ అని వ్యాఖ్యానించాడు. దీనినే క్రీడా స్ఫూర్తి అని అందరూ కొనియాడారు. కానీ, ప్రస్తుత తరం క్రికెటర్ల ఆలోచనా ధోరణి అలా లేదు. దీనికి నిదర్శనమే పాక్ క్రికెటర్ తాజా వ్యాఖ్యలు.
నోటి దూల..
‘‘భారత్ ప్రపంచ కప్ ఓడిపోవడం మాకు ఆనందం కలిగించింది. తద్వారా క్రికెట్ గెలిచింది. భారత్ గనుక ప్రపంచ విజేత అయి ఉంటే.. అది మాకు చాలా బాధాకర క్షణంగా మిగిలిపోయేది. మ్యాచ్ కు ముందే వారు పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు. ఐసీసీ ఫైనల్ కు ఇలాంటి దారుణమైన పిచ్ ను ఉపయోగించడం నేనెప్పుడూ చూడలేదు. భారత్ ఓడిపోవడం క్రికెట్ కు మంచి పరిణామం’’ అని పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ వ్యాఖ్యానించాడు. ఇందులో అతడి దుగ్ధ అంతా బయటపెట్టుకున్నాడు. ఇది చూస్తుంటే.. రజాక్ ది ఆవేదన కాదు.. ఆక్రోశం అని అర్థమవుతోంది. వాస్తవానికి ప్రపంచ కప్ లో ఫైనల్ తప్ప భారత్ అజేయంగా నిలిచింది. ఎలాంటి పిచ్ ఎదురైనా నిలిచింది. కొన్ని మ్యాచ్ లలో పరిస్థితులు ప్రతికూలంగా మారినా.. తనవైపు తిప్పుకొంది. ఫైనల్లో ఆస్ట్రేలియా ఎదురుపడడంతో అందుకు వీలు చిక్కలేదు. అప్పటికీ.. మన జట్టు తీవ్రంగా ప్రయత్నించింది. ప్రత్యర్థి ఆసీస్ కావడంతో పాచిక పారలేదు. ఇవేవీ పట్టించుకోకుండా అబ్దుల్ రజాక్ నోరు జారాడు.
పిచ్ ను తిడుతూనే.. భారత్ పై ఏడుపు..
రజాక్ కామెంట్ల పరిశీలిస్తే.. పిచ్ ను తిడుతూనే, భారత్ పై ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే అతడి మాటల్లో స్పష్టత లేదని అర్థమవుతోంది. అహ్మదాబాద్ స్టేడియం పిచ్ మొదట్లో బౌలింగ్ కు అనుకూలించింది. ఆసీస్ బ్యాటింగ్ సగం అయ్యేసరికి బ్యాటింగ్ కు అనుకూలంగా మారింది. మంచు ప్రభావం తోడవడమే దీనికి కారణం. దీనినిబట్టి చూస్తే.. అటు బ్యాట్స్ మన్ ఇటు బౌలర్లకు సమంగా పిచ్ సహకరించింది. ఇక్కడ గెలిచింది క్రికెట్. అయితే, దీనిని రజాక్ పట్టించుకోలేదు. పిచ్ ను తిట్టాడు. భారత్ పై పడి ఏడ్చాడు.
మరి పాకిస్థాన్ సంగతో...?
భారత్ ఓటమి రజాక్ కు ఆనందం కలిగించింది సరే.. మరి పాకిస్థాన్ సంగతి ఏమిటనేది అతడు చూసుకోవాల్సింది. అఫ్ఘానిస్థాన్ వంటి జట్టు చేతిలోనూ ఓడిన పాక్.. సెమీ ఫైనల్ వరకే రాలేదు. వారి కెప్టెన్ బాబర్ అజామ్ పగ్గాలు వదిలేశాడు. చీఫ్ సెలక్టర్ ఇంజమాన్ అయితే రాజీనామానే చేశాడు. ఇదేమీ పట్టించుకోకుండా భారత్ పై ఏడుస్తున్నాడు రజాక్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రోజుల్లో రజాక్ కు మంచి ఆల్ రౌండర్ గా పేరుంది. సచిన్ టెండూల్కర్ వంటి బ్యాట్స్ మన్ నే బాగా ఇబ్బందిపెట్టాడు. లైన్ లెంగ్త్ తప్పని బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను ఔట్ చేసేవాడు. లోయార్డర్ లో బ్యాట్ తో విలువైన పరుగులు చేసేవాడు. అలాంటి రజాక్.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేసి తన పరువు తానే తీసుకున్నాడు.
కొసమెరుపు: భారత్ ఓడినందుకు సంతోషం అంటున్న రజాక్ కు.. క్రమశిక్షణ గల క్రికెటర్ గా పేరులేదు.