ఇంగ్లండ్ ను చుట్టేసి.. కంగారూలనూ పడగొట్టి.. ‘తొలి టెస్టు గెలుపు’

టి20ల్లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతూ.. వన్డేల్లో మేటి జట్టుగా ఎదుగుతున్న భారత మహిళలు టెస్టుల్లో మాత్రం కాస్త వెనుకబడ్డారు.

Update: 2023-12-24 11:47 GMT

ఫీల్డింగ్ లో మెరికలు.. బ్యాటింగ్ లో దూకుడు.. బౌలింగ్ వేగం..మొత్తమ్మీద పురుషులకు తీసిపోని విధంగా ఆడే మహిళలు.. మనకంటే వారు మైదానంలో పదేళ్లు ముందున్నట్లుగా అనిపిస్తుంది.. వారితో మ్యాచ్ అంటే ముందే ఆశలు వదులుకోవాలి.. ఇక టెస్టు మ్యాచ్ అంటే మనం ఐదు రోజులు ఆడగలిగితేనే గొప్ప. ఇదంతా మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు గురించి. మొత్త 8 వన్డే ప్రపంచ కప్ లు గెలుచుకుంది ఆ జట్టు. దీన్నిబట్టే చెప్పొచ్చు ఆస్ట్రేలియా సత్తా ఏమిటో? అలాంటి జట్టుపై టీమిండియా మహిళలు తొలి టెస్టు విజయాన్ని సాధించారు.

టి20ల్లో ఇప్పుడిప్పుడే రాటుదేలుతూ.. వన్డేల్లో మేటి జట్టుగా ఎదుగుతున్న భారత మహిళలు టెస్టుల్లో మాత్రం కాస్త వెనుకబడ్డారు. ఐదు రోజుల ఆటకు తగ్గట్లు నిలవలేకపోవడమే దీనికి కారణంగా. విదేశాల్లో అయితే మరింత తేలిపోతారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లతో ఇక చేతులెత్తేస్తారు.

అయితే, ఇటీవల టి20 సిరీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడినప్పటికీ.. భారత మహిళల జట్టు ఏకైక టెస్టులో ప్రత్యర్థిని కుప్పకూల్చింది. ఒక్క రోజులోనే 410 పరుగులు.. ఒక్క సెషన్ లోనే 10 వికెట్లు.. మూడు రోజే మ్యాచ్ కు ముగింపు.. ఇన్నింగ్స్ విజయం సాధించింది. అది కూడా మహిళా క్రికెట్ చరిత్రలో రికార్డు ఆధిక్యం.. బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సూపర్ స్టార్లున్న పురుషుల జట్టుకూ సాధ్యం కాని గొప్ప గెలుపును అందుకుంది అమ్మాయిల జట్టు. ఇంత అద్భుతాన్ని సాధించిన మహిళల జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

కంగారూలను ఓడించేశారు..

ఇంగ్లండ్‌ ను భారీ తేడాతో ఓడించిన టీమిండియా.. ఆస్ట్రేలియానూ మట్టికరిపించింది. ఇది ఆస్ట్రేలియాపై తొలి టెస్టు గెలుపు కావడం విశేషం.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ ను భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆసీస్‌ తో తలపడిన 10 టెస్టుల్లో టీమిండియాకు ఒక్కసారీ గెలుపు దక్కలేదు. 11 ప్రయత్నంలో మాత్రం ఘన విజయం సాధించింది. ఓవర్‌ నైట్‌ 233/5 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ 261 పరుగులకే ఆలౌటైంది. 75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండు వికెట్ల నష్టంతోనే విజయతీరాలకు చేరింది. స్మృతీ మంధాన (38*), జెమీమా రోడ్రిగ్స్ (12*) జట్టును గెలిపించారు. ఇంగ్లండ్ పై బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించింది.. ఆస్ట్రేలియాపైనా అదే ఆధిక్యం చూపింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 219 పరుగులకే ఆలౌట్ చేసిన మన అమ్మాయిలు.. 406 పరుగులు సాధించారు. రెండో ఇన్నింగ్స్ లో కంగారూలు కాస్త పోరాడి 261 పరుగులు చేయగలిగారు. అయితే, 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళలు అలవోకగా ఛేదించేశారు. మొత్తమ్మీద ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టుల్లో భారత్ ఓడింది. ఆరు మ్యాచ్ లు డ్రా అయ్యాయి.

Tags:    

Similar News