రంజీల్లోనూ రోహిత్ బ్యాడ్ లక్.. కశ్మీర్ చేతిలో ముంబై పరాజయం
ఈ దెబ్బలతో స్టార్ ఆటగాళ్లయినా సరే దేశవాళీల్లో ఆడాల్సిందేనంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదేశాలిచ్చింది.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వ్యక్తిగతంగానే కాదు టీమ్ పరంగానూ బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.. గత ఏడాది నవంబరులో అతడి నాయకత్వంలో భారత జట్టు న్యూజిలాండ్ తో చేతిలో 0-3తో క్లీన్ స్వీప్ అయింది. చరిత్రలో ఎన్నడూ లేని పరాజయం ఇది. ఆపై ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్- గావస్కర్ సిరీస్ లోనూ మన జట్టుకు ఓటమే మిగిలింది. వరుస వైఫల్యాల కారణంగా చివరి టెస్టుకు రోహిత్ ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దెబ్బలతో స్టార్ ఆటగాళ్లయినా సరే దేశవాళీల్లో ఆడాల్సిందేనంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆదేశాలిచ్చింది.
టీమ్ ఇండియాలో కీలక బ్యాటర్ గా మారాక రోహిత్ శర్మ దేశవాళీల్లో ఆడిందే లేదు. టి20లు, వన్డేలు, ఐదేళ్ల కిందట టెస్టులు, ఐపీఎల్ తో బిజీగా ఉన్న అతడు రంజీల మొహం చూడలేదు. కాగా, బీసీసీఐ నిబంధనలు, తన పేలవ ఫామ్ రీత్యా దశాబ్దం తర్వాత తాజాగా జమ్మూ కశ్మీర్ తో మ్యాచ్ బరిలో దిగాడు.
తనతో పాటే జట్టూ ఫెయిల్
ఎలైట్ గ్రూప్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ తో మ్యాచ్ లో ముంబై దారుణ ప్రదర్శన చేసింది. టీమ్ ఇండియా ఓపెనర్లయిన రోహిత్, యశస్వి జైశ్వాల్ ఓపెనింగ్ చేసినా తొలి ఇన్నింగ్స్ లో 120 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ 3 పరుగులకే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ 28 పరుగుల మోస్తరు స్కోరు చేశాడు.
మొత్తమ్మీద ముంబై తొలి ఇన్నింగ్స్ లో 120, రెండో ఇన్నింగ్స్ లో 290 పరుగులకు ఆలౌటైంది.
జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ లో 206 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టుకు 205 పరుగుల టార్గెట్ ఎదురైంది. దీనిని ఐదు వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
ముంబై 42 సార్లు రంజీట్రోఫీ గెలిచింది. దేశవాళీ క్రికెట్ లో ఆ జట్టు పేరు వింటేనే బెంబేలెత్తేవారు. అలాంటి జట్టు కశ్మీర్ చేతుల్లో.. అదీ రోహిత్, జైశ్వాల్ ఉండగా ఓడడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కశ్మీర్ చేతిలో ఓడిన ముంబై జట్టుకు కెప్టెన్ సీనియర్ బ్యాట్స్ మన్ అజింక్య రహానె కావడం గమనార్హం. ఇదే జట్టులో శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్ వంటి టీమ్ ఇండియా ఆటగాళ్లున్నారు. అయినా కశ్మీర్ కలిసికట్టుగా ఆడి గెలిచింది.