చరిత్రకొక్కడు.. ఇక వీడ్కోలు.. 700 వికెట్ల ఏకైక పేస్ యోధుడి నిష్క్రమణం

కేవలం స్వింగ్ మాత్రమే ఆయుధమైన పేస్ బౌలర్ పదేళ్లు టెస్టులు ఆడడమే గొప్ప.. కానీ అతడు 21 ఏళ్లు ఆడాడు

Update: 2024-05-13 12:30 GMT

కేవలం స్వింగ్ మాత్రమే ఆయుధమైన పేస్ బౌలర్ పదేళ్లు టెస్టులు ఆడడమే గొప్ప.. కానీ అతడు 21 ఏళ్లు ఆడాడు.. ఒక పేసర్ 400 వికెట్లు తీస్తేనే అతడు దిగ్గజం.. కానీ అతడు 700 పడగొట్టాడు.. ఒక పేసర్ మరొక స్పిన్ బౌలర్ తో మాత్రమే ఎక్కువ వికెట్లు తీయగలడు. కానీ, అతడు మరో పేసర్ తో కలిసి వెయ్యికి పైగా వికెట్లు సాధించాడు. మొత్తమ్మీద 700వ వికెట్ ను భారత గడ్డపైనే తీసి ఈ ఘనత సాధించిన ఏకైక పేసర్ గా చరిత్రలో నిలిచాడు.

2003 మే నుంచి 2024 మే వరకు..

వాలీ గ్రేస్ నుంచి లెన్ హట్టన్, అలిస్టర్ కుక్ వరకు ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఎందరో గొప్ప బ్యాట్స్ మెన్ వచ్చారు. కానీ, గొప్ప బౌలర్లు ఎవరంటే మాత్రం చెప్పలేం. ఇకపై మాత్రం జేమ్స్ అండర్సన్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. 700 వికెట్లు సాధించిన తొలి పేసర్ అండర్సన్. వెస్టిండీస్‌తో చరిత్రాత్మక లార్డ్స్‌ మైదానం వేదికగా జులై 10న మొదలయ్యే టెస్టు మ్యాచ్‌ తో కెరీర్‌ కు వీడ్కోలు పలకనున్నట్లు అతడు ప్రకటించాడు. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడిన ఆట నుంచి తప్పుకోవడం బాధగా ఉందని, కానీ, వీడ్కోలుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్ నుంచి వెళ్లి చెప్పిన కోచ్

ఇంగ్లండ్ జాతీయ జట్టు కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన బ్రెండన్ మెక్ కల్లమ్.. ఇటీవల లండన్ వెళ్లి అండర్సన్ తో మాట్లాడాడు. ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2025-26కు సంబంధించి జట్టు ప్రణాళికలను వివరించాడు. దీంతో.. అండర్సన్ కు తన పరిస్థితి అర్థమై రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, 187 టెస్టులు ఆడిన అతడు 700 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ధర్మశాల వేదికగా భారత్‌ తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 700 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. టెస్టుల్లో 700 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్‌ అండర్సన్‌. అంతేకాదు ఏకైన పేసర్‌ కూడా అతడే. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800), ఆస్ట్రేలియా దివంగత దిగ్గజ లెగ్ స్నిన్నర్ షేన్ వార్న్ (709) అతడికంటే ముందున్నారు. అండర్సన్ 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది టెస్టుల్లోకి అడుగుపెట్టిన అండర్సన్ 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

కొసమెరుపు: మరో 9 వికెట్లు తీస్తే అత్యధిక వికెట్ల వీరుల జాబితాలోకి రెండో స్థానంలోకి చేరతాడు అండర్సన్. అయితే, లార్డ్స్ లో టెస్టు తర్వాత తప్పుకోనున్న అతడు ఈ రికార్డును అందుకోవడం కష్టమే. 10 వికెట్లు తీయాలంటే అది అసాధ్యమే.

Tags:    

Similar News