కార్ల్‌ సన్‌ కు షాకిచ్చిన కార్తికేయన్... మూడో ఇండియన్ గా రికార్డ్!

ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌ సన్ కు భారత కుర్రాడు షాకిచ్చాడు. ఇందులో భాగంగా... ఖతార్ మాస్టర్స్ 2023లో కార్ల్‌ సన్ ను ఇండియన్ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్‌ ఓడించాడు.

Update: 2023-10-19 15:06 GMT

ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌ సన్ కు భారత కుర్రాడు షాకిచ్చాడు. ఇందులో భాగంగా... ఖతార్ మాస్టర్స్ 2023లో కార్ల్‌ సన్ ను ఇండియన్ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్‌ ఓడించాడు. తమిళనాడులోని తంజావూరుకు చెందిన 24 ఏళ్ల ఈ కుర్రాడు నల్లపావులతో బరిలోకి దిగి, ఏడో రౌండ్‌ లో ప్రపంచ నెంబర్‌ వన్‌ ను మట్టికరిపించాడు. దీంతో కార్ల్ సన్ ను ఓడించిన మూడో భారతీయుడిగా కార్తికేయన్ రికార్డ్ సృష్టించాడు.

అవును... ఖతార్ మాస్టర్స్ 2023లో కార్ల్‌ సన్ ను కార్తికేయన్‌ ఓడించాడు. దీంతో... విశ్వనాథన్‌ ఆనంద్‌, హరికృష్టల తర్వాత కార్ల్‌ సన్‌ ను ఓడించిన మూడో భారతీయ చెస్‌ క్రీడాకారుడిగా కార్తికేయన్‌ రికార్డులకెక్కాడు. వీరిలో హరికృష్ట 2005లోనూ, విశ్వనాథన్‌ 2022 నార్వే చెస్‌ టోర్నీలోనూ కార్ల్‌ సన్‌ ను ఓడించారు. ఈ క్రమంలో తాజా గెలుపుతో కార్తికేయన్ వారి సరసన చేరాడు.

తంజావూరుకు చెందిన కార్తికేయన్‌ గతంలో రెండు సార్లు నేషనల్‌ ఛాంపియన్‌ గా నిలిచాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌ లో 163వ స్థానంలో ఉన్నాడు. కాగా... గతకొంతకాలంగా భారత్ ఆటగాళ్లు ఈ మధ్యన విశ్వవేదికలపై తమ సత్తాను చాటుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు చెస్ అంటే విశ్వనాథన్ ఆనంద్ పేరే గుర్తుకు వచ్చేది.. కానీ, ఇప్పుడు యువ గ్రాండ్ మాస్టర్స్ సైతం ప్రపంచ వేదికలపై సంచనాలు రేపుతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద వరల్డ్ రికార్డ్ నమోదు చేసాడు. గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ కు చేరుకున్న భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఫైనల్‌ లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ మాగ్నస్‌ కార్ల్‌ సన్‌ తో పోటాపోటీగా తలపడ్డాడు. కాగా ప్రపంచకప్‌ లో ఫైనల్ ఆడిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డుకెక్కిన ప్రజ్ఞానంద్.. వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ లో రన్నరప్‌ గా నిలిచాడు.

గ్రాండ్ మాస్టర్ అంటే ఏమిటి?

ప్రపంచ ఛాంపియన్ కాకుండా, "గ్రాండ్‌ మాస్టర్" అనేది ఒక ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్ సాధించగలిగే అత్యధిక వ్యక్తిగత టైటిల్! ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) 1950లో ఈ టైటిల్‌ ను సృష్టించిం.. ఆ సమయంలో ఎటువంటి వ్రాత పూర్వక ప్రమాణాలు లేకుండానే సుమారు 27 మంది ఆటగాళ్లకు ఈ టైటిల్ ను ప్రదానం చేసింది. అప్పటి నుండి ఇప్పటివరకూ సుమారు 2,027 మంది ఆటగాళ్ళు గ్రాండ్‌ మాస్టర్ టైటిల్‌ ను గెలుచుకున్నారు. ఇలా గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకున్న వారిలో భారతదేశం నుండి 83 మంది ఉన్నారు.

గ్రాండ్ మాస్టర్ కావడానికి అర్హత - ప్రమాణాలు:

ఒక క్రీడాకారుడు అతని/ఆమె కెరీర్‌ లో ఏ సమయంలోనైనా కనీసం 2500 ఎలో రేటింగ్ కలిగి ఉండాలి. ఎలో రేటింగ్ అనేది చెస్‌ లో నైపుణ్యాల కొలత!

ఒక క్రీడాకారుడు టోర్నమెంట్‌ లో కనీసం 27 గేం ల నుండి మూడు అనుకూలమైన ఫలితాలను సాధించాలి.

కనీసం 40 మంది పాల్గొనే ఆటగాళ్లతో స్విస్ టోర్నమెంట్‌ లో సగటు ఎలో రేటింగ్ 2000-ప్లస్‌ తో కనీసం ఒక ఫలితం రావాలి.

టోర్నమెంట్ ముగింపులో ఆటగాడి ఎలో రేటింగ్ తప్పనిసరిగా కనీసం 2600 ఉండాలి.

ఆటగాడి ప్రత్యర్థుల్లో కనీసం 33% మంది గ్రాండ్‌ మాస్టర్‌ లు అయి ఉండాలి.

ఒక ఆటగాడి ప్రత్యర్థులు తప్పనిసరిగా కనీసం మూడు వేర్వేరు చెస్ సమాఖ్యల నుండి రావాలి.

Tags:    

Similar News