నాడు 23 ఏళ్ల కుర్రాడిగా..నేడు 36 ఏళ్ల వెటరన్ గా..రంజీల్లో కోహ్లి
జాతీయ జట్టులో చోటు ఖాయమయ్యాక.. ఐపీఎల్ ఆడుతూ రంజీ ట్రోఫీని విస్మరించిన వారంతా నేడు మేమూ ఆడతామంటూ వరుస కడుతున్నారు.
వరుస వైఫల్యాలు.. బీసీసీఐ హెచ్చరికలతో టీమ్ ఇండియా స్టార్లు దేశవాళీ పిచ్ పైకి దిగొచ్చారు. జాతీయ జట్టులో చోటు ఖాయమయ్యాక.. ఐపీఎల్ ఆడుతూ రంజీ ట్రోఫీని విస్మరించిన వారంతా నేడు మేమూ ఆడతామంటూ వరుస కడుతున్నారు. వీరిలో స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఉండడం గమనార్హం.
బహుశా దశాబ్దం దాటిపోవడంతో ఏ ఆటగాడు రంజీ ట్రోఫీలో ఏ జట్టుకు (రాష్ట్రానికి) ఆడతాడో తెలియని పరిస్థితి. తాము ఎదిగివచ్చిన నేపథ్యాన్ని చిన్న చూపు చూడడం అని చెప్పలేం కానీ.. అంతర్జాతీయ స్థాయిలో తీరిక లేని షెడ్యూల్, గాయాల భయం తదితరాలతో స్టార్ క్రికెటర్లు దేశవాళీల్లో ఆడడం బంద్ చేశారు.
సీనియర్లు అంటే సర్లే అనుకోవచ్చు కాస్త సమయం ఉన్నప్పటికీ కుర్రాళ్లు కూడా దేశవాళీలు ఆడడం బంద్ చేశారు. అయితే, ఇటీవలి ఫెయిల్యూర్స్ తో బీసీసీఐ విధించిన ‘టెన్ కమాండ్ మెంట్స్’ ఆటగాళ్లను కదిలించాయి.
అప్పుడెప్పుడో 2012లో 23 ఏళ్ల కుర్రాడిగా ఉన్న విరాట్ కోహ్లి రంజీట్రోఫీలో సొంత రాష్ట్రం ఢిల్లీకి ఆడాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు బరిలో దిగబోతున్నాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్ తో ఢిల్లీ ఆడే చివరి లీగ్ మ్యాచ్ లో కోహ్లి బరిలోకి దిగుతాడు. వాస్తవానికి గురువారం నుంచి జరిగే ఢిల్లీ, సౌరాష్ట్ర మ్యాచ్ లోనే కోహ్లి ఆడాల్సి ఉంది. కానీ, మెడ నొప్పితో అతడు దూరమయ్యాడు. ఢిల్లీకి హెడ్ కోచ్ గా టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ శరణ్ దీప్ సింగ్ వ్యవహరిస్తున్నాడు. అతడే కోహ్లి ఆడే విషయం చెప్పాడు.
అంతర్జాతీయ మ్యాచ్ లు లేకుంటే ఆటగాళ్లు అందరూ కచ్చితంగా దేశవాళీ లీగ్ లలో ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, యువ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లు రంజీల్లో దిగుతున్నారు.
కాగా, కోహ్లి 2012లో యూపీతో చివరగా రంజీ ఆడాడు. ఢిల్లీ తరఫున కోహ్లి 23 మ్యాచ్ లలో 50.77 సగటుతో 1,574 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పంత్ ఆరేళ్ల కిందట రాజ్ కోట్ లో చివరగా రంజీ ట్రోఫీ ఆడాడు. జమ్ము కశ్మీర్ తో ముంబై మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడనున్నాడు.